తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, బీఎల్ సంతోష్ నమ్మకంగా చెబుతున్నారు. ఆ స్థాయి నేతలు అలా చెబుతున్నారంటే.. ఖచ్చితంగా వారి ప్రణాళికలు వారికి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని ఎక్కువ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందుకే బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు క్లారిటీగానే చెప్పారు.కంగారు పడాల్సిందేమీ లేదని.. హంగ్ వస్తుందని చెప్పారు. అంటే బీజేపీదే ప్రభుత్వం.
తెలంగాణలో హంగ్ అసెంబ్లీకి అవకాశం
తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోందన్న అభిప్రాయానికి వచ్చింది. తమకు పూర్తి మెజార్టీ రాకపోవచ్చు కానీ.. బలమైన పార్టీల్లో ఒకటిగా నిలబడే అవకాశాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చింది. సర్వేల ప్రకారం రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని బీజేపీ నేత బీఎల్ సంతోష్ ప్రకటించారు. తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని.. బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పడం ద్వారా బీజేపీ దగ్గర ప్లాన్ బీ ఉందని చెప్పకనే చెప్పారు.
బీఆర్ఎస్‌కు మరో ఆప్షన్ ఉండదు. బీజేపీకి మద్దతివ్వడమే !
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న అధికార బీఆర్ఎస్‌ను.. ఈ సారి ఓడించి గద్దెనెక్కాలని కాంగ్రెస్, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే .. ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కావాలంటే ఏడు సీట్లకు అటూ ఇటూ ఉండే ఎంఐఎం మద్దతు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే బీజేపీతో ఎంఐఎం జట్టు కట్టే ఛాన్స్ ఎంతమాత్రం ఉండదు. సో.. మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఇక బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలూ లేవు. ఇక మిగిలింది బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. బీఆర్ఎస్‌కు మరో చాయిస్ ఉండదు. కాంగ్రెస్ వైపు వెళ్తే బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతుందని.. చరిత్ర కూడా చెబుతోంది.
వచ్చే ఎన్నికల తర్వాత నాటకీయ పరిణామాలు
వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాసం ఉంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పాటైతే బీజేపీకి ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. బీజేపీ వల్లనే అభివృద్ధి సాధ్యమని.. మోదీ నాయకత్వం దేశానికి అవసరమని ఎక్కువ మంది బీజేపీ వైపు మొగ్గారు. తెలంగాణలోనూ అదే జరిగే చాన్స్ ఉంది.