వదల బొమ్మాళి అంటున్న ఈడీ…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న కొద్దీ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల్లో పట్టుదల అంతగా పెరుగుతోంది. పైగా ఆయన్ను విచారించడం ద్వారా లిక్కర్ స్కామ్ లో కీలకాంశాలు బయటపడతాయని విశ్వసిస్తున్నారు. పలువురు ఆప్ నేతల బాగోతాలను కూడా బయట పెట్టేందుకు కేజ్రీవాల్ సహా కొందరు పెద్దలను ప్రశ్నించాల్సి ఉంటుందని భావిస్తున్నారు….

జనవరి 3న రావాలని పిలుపు

కేజ్రీవాల్ రెండు పర్యాయాలు ఈడీ సమన్లను బేఖాతరు చేశారు. రెండు సార్లు కుంటి సాకులు చెప్పారు. నవంబరు 2న హాజరు కావాల్సి ఉండగా వెళ్లలేదు. తిరిగి డిసెంబరు 21న రావాలని ఈడీ కబురంపింది. అకస్మాత్తుగా ఆయనకు విపాసన గుర్తొచ్చింది. పది రోజుల పాటు పంజాబ్ లో విపాసన యోగా కార్యక్రమానికి వెళ్తున్నట్లు ప్రకటించి అంతర్థానమయ్యారు. అదేమంటే కేజ్రీవాల్ ముందే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమమని ఆప్ వర్గాలు వెల్లడించాయి. దానితో ఓపిగ్గా వేచి చూడాలని నిర్ణయించుకున్న ఈడీ…కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేయాలని తీర్మానించింది. జనవరి 3న ఢిల్లీ ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.

ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలి

బాబోయ్ అన్యాయం జరిగిపోతోందంటూ ఆప్ నేతలు గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. సమన్లు వచ్చాయే లేదో ఎదురుదాడికి తెరతీశారు. ఇదీ న్యాయ ప్రక్రియ కాదని, బీజేపీ వారి రాజకీయ కక్షసాధింపు కుట్ర అని అంటూ భారీ డైలాగులు వదులుతున్నారు. విపాసన యోగకు వెళ్లిన కేజ్రీవాల్ సమన్లను అందుకోలేరని తెలిసి కూడా నోటీసులు పంపారని ఆరోపిస్తున్నారు. నిజానికి సమన్లు అందజేయడానికి సదరు వ్యక్తి అందుబాటులో ఉండాలనేమీ రూల్ లేదు. ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు ఇచ్చి రావచ్చు. లేని పక్షంలో ఇంటి గోడకు సమన్లు అంటించి రావచ్చు. వాళ్లు ఎన్ని మాట్లాడినా ఈడీ ముందు ఒక కర్తవ్యముంది. స్కామును పూర్తిగా ఛేదించి నిజాలు రాబట్టాల్సిన అనివార్యత ఆ దర్యాప్తు సంస్థపై ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరవింద్ కేజ్రీవాల్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తే అసలు స్కాము బయటకు వస్తుందని ఈడీకి తెలుసు. ఆ పని చేస్తే తమ బండారం బయట పడుతుందని భయపడే కేజ్రీవాల్ నాటకాలాడుతూ తప్పించుకు తిరుగుతున్నారని చెబుతున్నారు.

వంద ప్రశ్నలు సిద్ధం

కేజ్రీవాల్ ఈ ఏడాది ఏప్రిల్ లో ఈడీ ముందు హాజరయ్యారు. తర్వాత అనేక మందిని దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. వాటి ఆధారంగా కేజ్రీవాల్ ను మరో సారి ప్రశ్నించేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకుంది. ఆయనకు సమన్లు జారీ చేసే ముందే వంద ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సారి ఈడీ ముందు హాజరైతే.. కేజ్రీవాల్ సమాధానాలు దాటవేస్తారని, అప్పుడు అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నది బహిరంగ రహస్యం. అందుకే కేజ్రీవాల్ తప్పించుకుతిరుగుతున్నారు. ఆయన్ను వదిలి పెట్టేందుకు మాత్రం ఈడీ సిద్ధంగా లేదు…