ఓడిన నేతకే మళ్లీ పట్టం – అది కాంగ్రెస్ తీరు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఎలాంటి ప్రమాణాలు పాటించదు. పక్క పార్టీలను దెబ్బకొట్టడమనే ఏకైక సిద్ధంతంలో ఆ పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగా నిత్యం తప్పులో కాలేసినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంది. కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతుందనిపిస్తోంది..

జగదీష్ షెట్టార్ కు ఎమ్మెల్సీ నామినేషన్

బీజేపీపై అలిగి కాంగ్రెస్ లో చేరి ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ నామినేషన్ ప్రకటించింది. మొత్తం మూడు స్థానాలకు జూన్ 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా అందులో ఒకటి జగదీష్ షెట్టార్ కు కేటాయించారు. బహుశా ఓడిపోయిన తక్షణమే ఒక నేతకు ఎమ్మెల్సీ టికెట్ ఇప్వడం చాలా అరుదుగా జరుగుతుంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విషయంలోనూ అదే జరిగింది.

బీజేపీ వద్దనుకున్న నేత

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు షెట్టార్ బీజేపీలో చాలా బలమైన నేతగానే ఉన్నారు. ఈ సారి ఆయన గెలవడం కష్టమని గ్రహించిన బీజేపీ అధిష్టానం షెట్టార్ సేవలను మరో విధంగా ఉపయోగించుకోవాలనుకుంది.పది నెలల పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, స్పీకర్ గా పనిచేసిన షెట్టార్ కు పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కూడా చెప్పింది. అందుకే టికెట్ ఇవ్వలేదు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా షెట్టార్.. తొందరపడి కాంగ్రెస్ లో చేరారు. అప్పుడు కూడా ఆయనకు పరిస్థితిని వివరించాలనే బీజేపీ పెద్దలు ప్రయత్నించినా షెట్టార్ వినలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై హుబ్లీ – ధార్వాడ్ నియోజకవర్గంలో పోటీ చేసిన షెట్టార్ ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై ఆయనపై 34,289 ఓట్ల మెజార్టీతో గెలిచారు. షెట్టార్ కు విజయావకాశాలు లేవన్న బీజేపీ వాదన నిజమని కూడా తేలిపోయుంది..

లింగాయత్ ఓట్ల కోసం..

సాధారణంగా ఓడిపోయిన నేతకు ఏ పదవీ ఇవ్వకుండా కొన్ని రోజులు పార్టీకి పనిచేయమని చెబుతారు. షెట్టార్ విషయంలో మాత్రం ఆ పని జరగలేదు.షెట్టార్ ఓడిపోయినా ఆయన సామాజికవర్గమైన లింగాయత్స్ తమకు ఓటేశారని, షెట్టార్ పార్టీలో చేరడం వల్లే 25 నియోజకవర్గాల్లో తాము గెలిచామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు కూడా షెట్టార్ పై ప్రేమ కంటే లింగాయత్ ఓట్లపై ఆశతో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. పర్మినెంట్ గా లింగాయత్ ఓట్లు తమకే రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అది కుదరని పని అని అందరికీ తెలుసు. కర్ణాటకలో బీజేపీ బలపడటం ప్రారంభమైన దగ్గర నుంచి లింగాయత్ ఓట్లు కమలం పార్టీకే వస్తున్నాయి. లింగాయత్ పెద్దల పట్ల కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ గౌరవం ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమికి వేరు కారణాలున్నాయి. ఆ సంగతి అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తన కుల, మత రాజకీయాలను మళ్లీ మొదలెట్టింది. ఏది చేసినా ఆ పార్టీ సక్సెస్ కాదని అందరికీ తెలుసు…