రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో రాజకీయంగా సాధించిందేమిటో ఎవరూ చెప్పలేని అంశం. కరెక్టుగా చెప్పాలంటే కాంగ్రెస్ వారు సైతం చెప్పలేని అంశమది. ఐనా తొలి దశ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహించి..ఇప్పుడు రెండో దశగా మణిపూర్ టు ముంబై జరుగుతోంది.కాంగ్రెస్ పార్టీ ఏ పనీ సింపుల్ గా చేసే అలవాటు లేని పార్టీ. ఆడంబర ఖర్చు ఎక్కువ. తాహతుకు మించి పబ్లిసిటీ చేయడంలోనూ ఆ పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ అంశం ఇప్పుడిప్పుడే మరింత స్పష్టమవుతోంది…
ఈసీకి సమర్పించిన లెక్కలు
కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తమ పార్టీ ఖర్చులకు సంబంధించి ఒక నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించింది. కన్యాకుమార్ నుంచి కశ్మీరుకు రాహుల్ గాంధీ జరిపిన యాత్రలో రోజుకు రూ.50 లక్షలు ఖర్చయినట్లు పార్టీ స్వయంగా ప్రకటించింది. కిలోమీటర్ల లెక్క చూసుకుంటే కిలోమీటరుకు లక్షా 59 వేల రూపాయలు ఖర్చయ్యింది. సెప్టెంబరు 7న, 2022న యాత్ర ప్రారంభమై, జనవరి 30,2023న ముగిసింది. యాత్రకు మొత్తం రూ.71.83 కోట్లు ఖర్చుపెట్టారు. రాహుల్ 145 రోజులు నడిచారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర 4,500 కిలోమీటర్లు సాగింది. రాహుల్ కు అన్ని వర్గాలను కలుసుకునే అవకాశం వచ్చిందని చెప్పుకున్నప్పటికీ…ఆయన వేగంగా నడిచివెళ్తూ, చుట్టూ సక్యూరిటీతో ఎవ్వరినీ కలవలేదని మీడియా కథనాలు వచ్చాయి. యాత్రకు మాత్రమే వచ్చిన విరాళాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొంత మంది వ్యక్తిగతంగా కిలోమీటరుకు వంద రూపాయల వరకు డొనేట్ చేశారు. అలా రోజుకు లక్షా 34 వేల నుంచి రూ.6.70 లక్షల వరకు వసూలైంది.అది రోజు ఖర్చు యాభై లక్షలు ఏ మాత్రం సరిపోదు. ఇప్పుడు న్యాయ్ యాత్రలో తొలి నాలుగు రోజులకు నాలుగు కోట్లు వసూలైంది.
ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ…
కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తే అసలు పార్టీ వ్యవస్థ ఎలా నడుస్తోందన్న అనుమానమూ కలుగుతుంది. పార్టీకి విరళాల సహా ఇతర రూపాల్లో ఆదాయం వస్తుంది. అలా 2022-23లో కాంగ్రెస్ పార్టీకి రూ.452 కోట్ల రూపాయలు సమకూరాయి. బదులుగారూ.467 కోట్లు ఖర్చయ్యింది. ఈ లెక్కన చూసుకుంటే పార్టీకున్న రిజర్వ్ నిధులు కూడా కరిగిపోతున్నాయని అనుకోవాలి. ఎన్నికల వ్యయం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ రూ. 192 కోట్లు ఖర్చుపెట్టింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పార్టీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జనరల్ ఖర్చులు 2.6 రెట్లు పెరిగాయి. ఆదాయం రూ. 541 కోట్ల నుంచి రూ.452 కోట్లకు తగ్గింది.
జనాదరణ తగ్గడమే కారణమా..
గత పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి జనాదరణ తగ్గిపోయింది. పార్టీ పట్ల సానుభూతి కూడా చూపేందుకు జనం ఇష్టపడటం లేదు. అందుకే విరాళాలు తగ్గుతున్నాయని అంటున్నారు. 1980ల వరకు పార్టీకి విపరీతంగా విరాళాలు వచ్చేవి. ఇప్పుడు బీజేపీ బలపడటం, కమలం పార్టీ ప్రజల పార్టీగా పేరు పొందడంతో జనం కాంగ్రెస్ ను క్రమంగా దూరం పెడుతున్నారు..