ములాయం తప్పిదాన్ని సరిదిద్దిన కోర్టు

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వారణాసి ఆలయంపై పడింది. వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ఇచ్చి ఉత్తర్వులతో జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు తిరిగినట్లయ్యింది.జ్ఞానవాపి మసీదు ప్రాంగణ భూగృహంలో పూజలు చేసుకునేందుకు హిందూ భక్తులకు అనుమతి ఇస్తూ జిల్లా కలెక్టరుకు జడ్జి ఏకే విశ్వేష్ ఆదేశాలిచ్చారు.

రెండు రోజుల్లో పూజలు ప్రారంభం

పూజల వ్యవహారంలో కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ కు పూర్తి అధికారాలిచ్చారు. అసలు పూజలు ఎందుకు ఆపారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. వారంరోజుల్లో జ్ఞానవాపి భూగహంలో పూజలు చేసుకునే ఏర్పాట్లకు అవకాశం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే రెండు మూడు రోజుల్లోనే పూజలు మొదలు పెడతామని కాశీ విశ్వనాథ్ టెంపుల ట్రస్ట్ ఛైర్ పర్సన్ నాగేంద్ర పాండే వెల్లడించారు. ఆ ప్రాంతాన్ని సంరక్షించుకునేందుకు ఒక తలుపు కూడా ఏర్పాటు చేసుకుంటారు. కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకటించారు.తాజాగా మళ్లీ పూజలకు అనుమతి మంజూరుచేసిన నేపథ్యంలో దీనికనుగుణంగా వజూఖానా ముందున్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించే ఏర్పాట్లు చేయాలని, కాశీ విశ్వనాథ్ ట్రస్టు దీనికి సహకరించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది పూజారి సోమనాథ్‌ వ్యాస్‌ మనవడైన శైలేంద్రకుమార్‌ పాఠక్‌ ఇపుడు పూజలు చేస్తారు. వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్‌కుమార్‌ ఈ తీర్పును స్వాగతించారు

1993 వరకు పూజలు

శతాబ్దాలుగా జ్ఞానవాపి భూగృహంలో పూజలు జరుగుతూనే ఉన్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత అప్పటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం 1993లో అక్కడ అవరోధాలు సృష్టించింది. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి, ఐరన్ ఫెన్సింగ్ పెట్టింది. హిందువులు అక్కడకు వెళ్లి పూజలు చేయకుండా అడ్డుకుంది. వజుఖానాకు ఎదురుగా ఉన్న నంది విగ్రహం దగ్గర ఇంతకాలం బ్యారికేడ్లు ఉన్నాయి. 1993 వరకు సోమ్ నాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసే వారు. అప్పట్లో ముస్లిం వర్గాల ఓట్ల కోసమే ములాయం సింగ్ యాదవ్ … జ్ఞానవాపిలో పూజలు ఆపించారని హిందూ వర్గాలు ఆరోపిస్తూ వచ్చాయి. దానిపై అనేక వ్యాజ్యాలు కోర్టుల పరిశీలనలో ఉన్నాయి…

2022లో వజుఖానాకు సీలు

నిజానికి చాలా రోజులు ఆ ప్రాంతం తెరిచే ఉండేది. 2022లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వజుఖానాకు సీల్ వేశారు. అక్కడ శివలింగం ఉందని గుర్తించిన తర్వాత సీలు వేసినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో, వివరణాత్మక సర్వే చేయాలని గతేడాది జూలై 21న వారణాసి జిల్లా కోర్టు భారత పురావస్తు శాఖను ఆదేశించింది. ప్రస్తుత కట్టణ నిర్మాణానికి ముందు అక్కడ హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ నిర్ధారించింది. మసీదులో ఉన్న వాటర్ ట్యాంకును శుభ్రపరిచేందుకు గత వారం హిందూ మహిళా పిటిషనర్లకు కోర్టు అనుమతించింది. గత వారం వజుఖానాను శుభ్రపరిచే ప్రక్రియ కూడా పూర్తయ్యింది. దానితో పూజలకు కోర్టు అనుమతించగా… దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామని ముస్లిం వర్గాలు అంటున్నాయి.