ట’మోత’ను తగ్గించేందుకు కేంద్రం సత్వర చర్యలు

వ్యవసాయోత్పత్తులకు సంబంధించి దేశంలో కనీవినీ ఎరుగని పరిస్థితులు ఎదరువుతున్నాయి. అన్ని నిత్యాసరాల రేట్లు పెరిగిపోతున్నాయి. భోజనంలో నిత్యావసరమైన టమాట ధర ఇప్పుడు బెంబేలెత్తిస్తోంది. రామములగ కొనాలంటే జనం కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి.

టమాట @ 250

రుతుపవన కాలంలో భారీ వర్షాలతో టమాట ధరలు అమాతం పెరుగుతున్నాయి. గత మూడు వారాల్లో రిటైల్ తో పాటు హోల్ సేల్ మార్కెట్లో కూడా టమాట ధర బగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ ఆఖరి వారంలో టమాట ధర రూ. 30 వరకు ఉండగా, జూలై మొదటి వారంలో రూ. 180కి చేరింది. ఇప్పుడు చాందినీ చౌక్ ప్రాంతంలో రూ. 220కి విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ముంబైలో కిలో రూ. 150 వరకు పెరిగింది. చెన్నైలో అది రూ. 117 వరకు ఉంది ఉత్తర ప్రదేశ్లోని హాపూర్ లో ఏకంగా ఇవాళ రూ. 250 వరకు పలికింది. టమాట కొరత ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి దానితో రూ. 300 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే సగటు రేటు రూ. 117 ఉందని తేల్చారు.

కుటుంబ కలహాలు, పోలీస్ బందోబస్తు

టమాట కారణంగా కుటుంబాల్లో కలతలు ఏర్పడుతున్నాయి. భార్య,భర్తలు విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కూరలో టమాట ఎందుకు వాడావన్న తగాదాలు వస్తున్నాయి. వారిని పెద్ద మనుషులు కూర్చోబెట్టి సమాధాన పరచాల్సి వస్తోంది. టమాట లోడు వస్తుందంటే ఎగబడి లాక్కునేందుకు ప్రయత్నించే వాళ్లూ ఉన్నారు. దానితో కొన్ని చోట్ల పరిమిత స్థాయిలో ప్రభుత్వమే టమాటాలను విక్రయిస్తోంది. ఉత్తరాదిన రేట్లు ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రైతులు, వ్యాపారులు టమాటాలను లారీల్లో వేసుకుని అక్కడకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్లో ఓ లారీ బోల్తా పడింది. టమాట డబ్బాలను జనం దోచుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

రంగంలోకి దిగిన కేంద్రం

టమాట రేట్లను నియంత్రించేందుకు, కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) ద్వారా మొబైల్ వాహనాల్లో టమాటాలను విక్రయిస్తున్నారు. ఢిల్లీ, లక్నో, పట్నా, ముజఫర్ నగర్ సహా పలు ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కిలో రూ.90కి అమ్ముతున్నారు. ఢిల్లీ – ఎన్సీఆర్ లో నిన్న 18 వేల కిలోల టమాట లోడ్ దించితే… అది రెండు గంటల్లోనే ఖాళీ అయ్యింది. లక్నోలో నిన్న 7 వేల కిలోలు విక్రయించారు. మదర్ డెయిరీల్లో టమాటాలు విక్రయించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సాదారణంగా టమాట ధరలు జూలై నుంచి ఆగస్టు, అక్టోబరు- నవంబరు ప్రాంతాల్లో పెరుగుతాయి. అప్పుడు దిగుబడి బాగా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ సారి కేంద్రం త్వరగా రంగ ప్రవేశం చేసి ధరల నియంత్రణకు ప్రయత్నిస్తోంది. కేంద్ర చర్యలతో ధరలు దిగి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.