వచ్చే సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రెడీ అవుతోంది. ఇందు కోసం దీర్ఘ కాలిక ప్రణాళికలు ఎప్పట్నుంచో అమలు చేస్తున్నారు. అయితే సెమీ ఫైనల్స్ గా చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ తన సత్తా చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే సంబరాలు చేసుకున్నారు కానీ..అసలు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే ప్రజల నాడి ఎంటో తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
డిసెంబర్‌లో తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు !
డిసెంబర్‌తో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఒక్క మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. చత్తీస్ ఘడ్‌లో చాలా కాలం ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. తెలంగాణలో అధికారం చేపట్టడానికి దగ్గర్లో బీజేపీ ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం లోపాలకు తావు లేకుండా భారీ విజయాలు నమోదు చేయడానికి బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్లు రెడీ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ఆయా రాష్ట్ర నేతలకే ప్రాధాన్యం !
కర్ణాటకలో తప్పు ఎక్కడ జరిగిందో బీజేపీ విశ్లేషించుకంటోంది. రాష్ట్ర అంశాలను..జాతీయ అంశాలను మిళితం చేయడం ద్వారా ప్రజలు కన్ఫ్యూజ్ కు గురయ్యారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఎన్నికలు జరగనున్న నాలుగు పెద్ద రాష్ట్రాల్లో బాధ్యతలను ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలకే ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే ఒకరికి కాకుండా ఉమ్మడి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతల్ని ఎన్నికల్లో ప్రోత్సహించనున్నారు. బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల్లో మరోసారి స్వీప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాజస్థాన్ లో వసుంధర రాజేతో పాటు ఇతర నేతల్ని సమన్వయం చేయనున్నారు. రాజస్తాన్ కాంగ్రెస్ లో గెహ్లాట్, పైలట్ మధ్య పోరు రోడ్డుకెక్కింది. వారి పార్టీని బజారుపాలు చేసుకుంటున్నారు. అక్కడ బీజేపీ తమ రాష్ట్ర నేతలను సమన్వయం చేసుకుంటే భారీ విజయం ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. చత్తీస్ ఘడ్‌లో బీజేపీకి మంచి పట్టు ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం తగ్గించాలని ఓ ప్రణాళిక సిద్ధం చేశారు.
తెలంగాణలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్లాన్ !
తెలంగాణ బీజేపీ జోరు మీద ఉంది. గత ఎన్నికల నాటికి పోలిస్తే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎంతో మెరుగైంది. దాదాపుగాప్రతీ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ తయారయ్యారు. అందర్నీ నేతలు సమన్వయం చేసుకుంటే గెలుపు ఈజీనేనని హైకమాండ్ భావిస్తోంది. అందుకే బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతల్ని .. ప్రాంతాలవారీగా బాధ్యులుగా నియమించి పార్టీ విజయం కోసం ప్రయత్నాలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బ్లూ ప్రింట్ రెడీ అయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కి ప్రజల్లో ఉన్న మద్దతు గురించి అందరికీ ఓ అవగాహన వస్తుంది. కర్ణాటకలో స్థానిక పరిస్థితుల కారణంగా వచ్చిన బీజేపీ ఓటమితో సంతోషపడిన వారికి అప్పుడు సరైన స్ట్రోక్ తలగడం ఖాయమని ఆ పార్టీ నేతలంటున్నారు.