పరమేశ్వరుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేసిన మహాపుణ్యక్షేత్రం చిదంబరం. తమిళనాడు చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగయుగాల నుంచి ప్రసిద్ధిపొందింది. పంచభూతాల్లో ఒకటైన ఈ క్షేత్రం ఆకాశతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. 50 ఎకరాలుగా పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం.
స్థల పురాణం
చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు.
చిదంబర రహస్యం ఇదే!
గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూలవిరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలెట్టారు. పురోహితులు మందిరంలోని తెరను తొలగించి హారతి ఇస్తారు. భగవంతుడు ఆది, అంతం లేనివాడు అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఉండదు. అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుని సన్నిధిని వీక్షించడంతో దివ్యానుభూతి కలుగుతుంది.
నటరాజస్వామి ఆనంద తాండవం
ఇక్కడ ఈశ్వరుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. నాట్యభంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.చేతిలో నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందని అర్థం. అలాగే మరో హస్తం సర్వజగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది. ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది. పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు. అంత మహావిష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి వెళ్లమని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
గోవిందరాజస్వామి సన్నిధి
ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోవిందరాజస్వామి మందిరం ఉంది. శివ,కేశవ మందిరాలు ఒకే ప్రాంగణంలో ఉండటం అరుదైన విశేషం. హరి, హరులకు ఎలాంటి భేదాలు లేవని ఈ క్షేత్రం నిరూపిస్తోంది. 108 దివ్యదేశాల్లో ఒకటిగా గోవిందరాజస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. కులశేఖర ఆళ్వారు తన రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు.
మానవదేహానికి ప్రతీక చిదంబర ఆలయం
మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు.
ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.
చిదంబరం దేవాలయంలో “పొన్నాంబళం” కొంచెం ఎడమ వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి “పంచాక్షర పడి” ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది. “కనక సభ”లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు – శివారాధనా పద్ధతులు. 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీక. పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి సూచిక. ఇలా ఈ ఆలయ నిర్మాణం మొత్తంమానవ దేహానికి ప్రతీకగా ఉంటుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం