ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెలికించి వేయాలన్నది ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రతీ చోట జల్లెడ పట్టి మరీ ఉగ్రవాదులను బయటకు లాగుతోంది. చట్టం ముందు నిలబట్టి కఠిన శిక్షలు వేయిస్తోంది. ఉగ్రవాదులకు అంగుళం చోటు కూడా ఇవ్వకూడదన్న ఉద్దేశంతో భారత భద్రతా సంస్థలు నిఘాను పెంచాయి.
ఎన్ఐఏ అదుపులో ఐసీస్ ఉగ్రవాది
యూపీ, జార్ఖండ్ లో ఉగ్రవాద దాడులకు వ్యూహం పన్నినట్లు ఎన్ఐఏకు సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని అరెస్టు చేశారు. అతని పేరు ఫైజన్ అన్సారీ అలియాస్ ఫైజ్ గా గుర్తించారు.జార్ఖండ్ లోని లోహర్గాగా జిల్లాలోని అతని ఇంటిలో సోదాలు చేశారు. అలీగడ్ లో ఫైజ్ ఉంటున్న ఇంటిలో కూడా తనిఖీలు జరిగాయి.
ఐసీస్ తరపున కార్యకలాపాలు
పశ్చిమాసియా ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తరపున ఫైజ్ భారత్ లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతని ఇంటిలో ఎలక్ట్రానికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు దొరికాయి. సోషల్ మీడియాలో అతను ఐసీస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. యువతను ఉగ్రవాదం వైపుకు ఆకర్షితులను చేసి వారిని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు భద్రతా దళాలు నిర్ధారణకు వచ్చాయి. దేశంపై ఉగ్రదాడులకు జనాన్ని పురిగొల్పుతున్నట్లుగా కూడా గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వ జీరో టాలరెన్స్
ఉగ్రవాదులను, ఉగ్రకుట్రలను ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ ఎప్పుడో హెచ్చరించారు. జిరో టాలరెన్స్ విధానం అంటే ఉక్కుపాదంతో అణచివేయడమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని పూర్తిగా అణిచివేసేందుకు కంకణం కట్టుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆ దిశగా ఎన్ఐఏకు పూర్తి స్థాయిలో స్వచ్ఛను, అధికారాలను ఇచ్చేశారు. 25 నుంచి 35 వయసు ఉన్న యువకులు ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని గ్రహించి ఎన్ఐఏ అధికారులు ఆ దిశగా అడుగులు వేశారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారందంచిన సమాచారం ఆధారంగానే జార్ఖండ్, యూపీలో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్న ఫైజ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫైజ్ ను విచారిస్తే ఇండియాలో ఉగ్రమూలాలు బయట పడే వీలుంది. విదేశాల్లో ఉంటున్న కొందరు సూత్రధారులు వీరిని నడిపిస్తున్నట్లుగా గుర్తించాయి. డిజిటల్ పేమెంట్స్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఉగ్ర యువతకు నిధులు అందుతున్నాయని ఎన్ఐఏ నిర్ధారించింది.