ఉగ్రవాదం, కుట్ర కోణం

పార్లమెంటులోకి ప్రవేశించి బీభత్సం సృష్టించేందుకు ఆరుగురు వ్యక్తులు చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఎలా వచ్చారు, ఎటు నుంచి ప్రవేశించారనేకంటే…వారి ఉద్దేశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణహానీ తలపెట్టేందుకు వచ్చారా..అన్న కోణంలో విచారణ జరుగుతోంది.భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన తీరులోనూ భయాందోళనలు తప్పడం లేదు….

వేర్వేరు చట్టాల కింద కేసులు….

సాగర్ శర్మ, డీ. మనోరంజన్ సహా అరెస్టయిన నలుగురిపై ఉగ్రవాదుల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు (ఉపా చట్టం), భారతీయ శిక్షా స్మృతి కింద కేసులు పెట్టినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కుట్ర పూరిత ఉద్దేశంతో వాళ్లు పార్లమెంటులోకి ప్రవేశించినట్లుగా నిర్ధారించారు. విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ప్రజాప్రతినిధుల విధులకు భంగం కలిగే విధంగా ప్రవర్తించారని కేసు పెట్టారు. వారి ప్రవర్తన ఉగ్రవాదం కిందుకే వస్తుందని నిర్థారణకు వచ్చి ఆయా సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు…

సోషల్ మీడియా స్నేహం…

సామాజిక మాధ్యమాల్లో పరిచయం, తర్వాత కలిగిన స్నేహం వారిని పార్లమెంటుపై దాడికి పురిగొల్పిందని ప్రాథమిక విచారణలో తేలింది. సాగర్ శర్మ, మనోరంజన్ లోక్ సభలోకి ప్రవేశించి పొగలు వచ్చే కానిస్టర్లు విసిరితే.. నీలం దేవీ అమోల్ షిండే బయట ఉండి ఆ పని చేశారు. మరో ఇద్దరు నిందితులు లలిత్ ఝా, విక్కీ శర్మ ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసి..అందరి సెల్ ఫోన్లు పట్టుకుని పారిపోయారు. వీరందరికీ ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే సామాజిక మాధ్యమంలో స్నేహితులుగా ఉన్నారు. ఏడాదిన్నర క్రితం వాళ్లు మైసూరులో కలుసుకుని పార్లమెంటులో దాడికి తొలి వ్యూహాన్ని రచించినట్లుగా విచారణలో తేలింది. తొమ్మిది నెలల క్రితం చండీగఢ్ విమానాశ్రయం దగ్గర రైతు నిరసనకు హాజరైన వీరంతా ప్లాన్ పై సమగ్ర చర్చ జరిపారు. ఈ ఏడాది జులైలో లక్నో నుంచి ఢిల్లీ వచ్చిన సాగర్ శర్మ.. పార్లమెంటులోకి ప్రవేశించలేకపోయినా రెక్కీ నిర్వహించి వెళ్లిపోయాడు. తాజాగా గత ఆదివారం ఢిల్లీ వచ్చిన వీరంతా గురుగ్రామ్ లోని విక్కీ నివాసంలో బస చేశారు. స్మోక్ కానిస్టర్లను అమోల్ షిండే మహారాష్ట్రలోని తన సొంతూరు నుంచి స్మోక్ కానిస్టర్లను పట్టుకొచ్చాడు.

లోపలికి వెళ్లేందుకు ఇద్దరికే అవకాశం….

నిజానికి ఆరుగురూ పార్లమెంటులోకి వెళ్లి గందరగోళం సృష్టించాలనుకున్నారు. అయితే మనోరంజన్, సాగర్ శర్మ ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం దొరికింది.ఘటన జరిగిన వెంటనే తొలుత నలుగురిని,తర్వాత మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసుల యాంటీ టెర్రర్ సెల్ అధికారులు వారందరినీ ఒక చోట కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. తన కుమారుడి ప్రవర్తనపై మనోరంజన్ తండ్రి దేవరాజ్ గౌడ్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇంతకాలం మంచివాడిగా ఉన్న మనోరంజన్ ఇలా ఎందుకు తయారయ్యాడో అర్థం కావడం లేదని ఆయన అంటున్నారు. తన కుమారుడు తప్పు చేసి ఉంటే ఉరితీయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరో పక్క హరియాణాలోని హిసార్ కు చెందిన నీలమ్… ఉద్యోగం దొరక్క ఉన్మాదిగా మారింది. ఎంఫిల్ చేసి, టీచర్ల అర్హత పరీక్ష పాసైనప్పటికీ ఉపాధి దొరకడం లేదని నిరుద్యోగిగానే చనిపోతానని నీలం తరచూ చెబుతుండేది. జింద్ వెళ్లి పోటీ పరీక్షలకు చదువుకుంటున్నానని చెప్పిన నీలం ఇలా ఎందుకు తయారైందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు…