బీజేపీపై పగబట్టిన తెలుగు మీడియా – దక్షిణాదిన బీజేపీ బలపడుతున్న విషయం ఎందుకు చెప్పరు ?

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే కన్నడ మీడియా కన్నా తెలుగు మీడియా.. తెలుగు రాష్ట్రాల్లో చేసిన హడావుడే చాలా ఎక్కువగా ఉంది. టీవీ చానల్స్ అతే అనుకుంటే దినపత్రికలు మరో అడుగు ముందుకేశాయి. కరోనా తర్వాత పేజీలు పూర్తి తగ్గించేసి.. పదిహేను పేజీలు మాత్రమే జిల్లా ఎడిషన్లు కలిపి ప్రింట్ చేస్తున్నారు. ఇందులో యాడ్స్.. ఎడిటోరియల్ , ఫీచర్స్ వంటివి పోను.. గట్టిగా ఐదు పేజీల్లో వార్తలివ్వడం కష్టం. అలాంటిది ఏకంగా ఒక్కో పత్రిక మూడు పేజీల కవరేజీతో కాంగ్రెస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. బీజేపీ ఓడిపోయిందని ఇక ఆ పార్టీ పనైపోయిందని చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయించారు.

బీజేపీపై తెలుగు మీడియాకు ఎందుకంత కోపం ?

బీజేపీ ఓడిపోయిన మాట నిజమే. కానీ నిజంగా విశ్లేషణ చేస్తే.. బీజేపీకి ఓట్ల శాతం అసలు తగ్గలేదు. బీజేపీ ఓటు బ్యాంక్ అసలు తగ్గలేదు. జేడీఎస్ ఓటు బ్యాంక్ తగ్గిపోయి కాంగ్రెస్ కు బదిలీ అయింది. ఈ కారణంగా కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఎవరి విన్.. ఎవరు గెయిన్ అనేది రాజకీయంగా పక్కన పెడితే.. తెలుగు మీడియా అసలు బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నట్లుగా రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకునేందుకు ప్రయత్నించారు. జన్మకో శివరాత్రిలా అతి కష్టం మీద ఓ రాష్ట్రంలో గెలిచిన పార్టీ విషయంలో ఇంత హడావడి చేస్తే.. గత పదేళ్లుగా దేశంలో తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ విషయంలో మాత్రం.. ఇలాంటి పాజిటివ్ నెస్‌ను పత్రికలు చూపించడం లేదు.

ఏపీలో ప్రభుత్వంపై పోరాటాలు మీడియాకు ఎందుకు కనిపించవు

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి నేతలు అనుకులంగా ఉన్నారని ఇతర మీడియాలు ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ బీజేపీ నేతలు ప్రభుత్వం పోరాడుతున్న అంశాలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వరు. సోము వీర్రాజు 40 సంవత్సరాలు నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడుతున్న నేత. పార్టీ కోసం పని చేయడమే తప్ప… రాజకీయంగా పెద్దగా పదవులు లేకపోయినా నిరంతరంశ్రమిస్తున్న నేత. ఆయన నేతృత్వంలో బీజేపీ అనేక ప్రజా పోరాటాలు చేస్తోంది. అనేక ఆటుపోట్లతో నాడు అధికార తెలుగుదేశంపై నేడు రాష్ట్రంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మీద బీజేపీ చేస్తున్న పోరాటానికి తెలుగు మీడియా ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలే్దు. సోము వీర్రాజు నాయకత్వంలో ఏపిలో జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ఉనికి కాపాడడం జరిగింది. మరో వైపు ప్రజా పోరు , ప్రజా చార్జీషీట్ వంటి ఏదో రకమైన ఉద్యమాలతో నెలలు 20 రోజులు ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తున్నారు. దీన్నెందుకు తెలుగు మీడియా గుర్తించదు. వ్యక్తిగత అభిప్రాయాలు తమత్రికల్లో అనునిత్యం ఆంధ్ర బీజేపీ మీద విద్వేషం వెదజల్లుతూ వార్తలు వండి రాస్తుంటారు. ఇవి పత్రికలకు మంచిదా, వాటి విశ్వసనీయ అంత అనేది ప్రజలు గమనిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారానికి దగ్గరగా ఉన్నది ఎందుకు అంగీకరించరు ?

కర్ణాటకలో బీజేపీ అధికార పార్టీ. ఎన్నికలు జరిగింది ఆ రాష్ట్రంలో . ప్రజలు ఓటింగ్ చేసింది ఆ రాష్ట్ర అంశాల మీద. తీర్పు అక్కడి వరకే పరిమితం. కానీ తెలుగు మీడియా ఏం చెబుతోంది… ఇక దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదని చెబుతోంది. తెలంగాణలో గెలవదని రాస్తోంది. తెలంగాణలో బీజేపీ ఎంత బలపడిందో మీడియాకు తెలియదా ?. బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ అధికారం పొందేందుకు ప్రధానంగా రేసులో ఉంది. అనేక సర్వేల్లో కాంగ్రెస్ కు మూడో స్థానమేనని చెబుతున్నాయి. దళిత బంధు అక్రమాల దగ్గర్నుంచి పేపర్ లీకేజీల వరకూ పెద్ద ఎత్తున తెలంగాణ బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. ప్రజా మద్దతు కూడగట్టుకుంటంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో కూడా అదే విషయం వెల్లడయింది. కానీ తెలంగాణ విషయంలోనూ బీజేపీ ప్రాధాన్యత తగ్గించి చూపించేందుకు తెలుగు మీడియా ఎందుకు ప్రయత్నిస్తోంది.

తమిళనాడులో ప్రజలపక్షాన నిజమైన ప్రతిపక్షంగా ఎదిగింది కనిపించడం లేదా ?

తమిళనాడులో డీఎంకే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నది ఎవరు ?. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది ఒకే ఒక్కరు ఆయనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలే. ప్రతిపక్ష అన్నాడీఎంకే పూర్తిగా అంతర్గత కుమ్ములాటలతో ఉంటే స్టాలిన్ ప్రభుత్వ అక్రమాలపై పోరాడుతున్నది అన్నామలై మాత్రమే. అన్నామలై బీజేపీని ఎంత బలోపేతం చేశారో తెలిసి కూడా తెలుగు మీడియా ఎందుకు గోప్యత పాటిస్తుందో.. నిజం చెప్పడానికి ఎందుకు కంగారు పడుతుందో పాఠకులకే తెలియాల్సి ఉంది.

ఇలాంటి ప్రచారం చేసి బీజేపీని ఎంత దెబ్బకొట్టగలరు ?

అసలు దక్షిణాదిలో ఇతర రాష్ట్ర ప్రజలకు తమ భావాలు వెల్లడించుకునే హక్కు లేదా.. వారి తరపున తెలుగు మీడియానే తీర్పులు ఇచ్చేస్తోందా ? తెలంగాణలో ఎవరికి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ ప్రజల మనసుల్ని గెల్చుకునేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నరు. ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడుతున్నారు. తెలుగు మీడియా సంస్థలకు బీజేపీ ఎప్పుడూ చెడు చేయలేదు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తూనే ఉంది. అయితే బీజేపీ విషయంలో ఆ మీడియా సంస్థలు ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయో వారికే తెలియాలి. వీరందరూ కలిసిన 2024లో బీజేపీ గెలుపుని అడ్డుకుంటామని ఒక్కరూ చెయలేరు. కర్ణాటకలో ఓడినంత మాత్రాన దక్షిణాదిలో బీజేపీకి చోటు లేదని చెప్పడం దుస్సాహసమే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. 2024లో వీరందరి కళ్లకు ఉన్న కారుమబ్బుల్ని ప్రజలు తొలగింప చేస్తారు. వాస్తవాలేంటో తెలుసుకుంటారు.