వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేస్తామని వారం రోజుల పాటు హడావుడి చేసిన భారత్ రాష్ట్ర సమితి, ఆ పార్టీ నేతలు, ప్రభుత్వం చివరికి సైలెంట్ అయిపోయారు. ఐదు రోజులు గడువు పొడిగింపు ఇచ్చినా సింగరేణితో కానీ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థతో కానీ బిడ్ దాఖలు చేయించలేదు. దీంతో స్టీల్ ప్లాంట్‌తో రాజకీయం చేయడానికి పెద్ద పెద్ద లేఖలు రాసి.. అంతకంటే పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన కేటీఆర్ ఇజ్జత్ పోయినట్లయింది. ఇప్పుడు అందరూ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది.
అసలు బిడ్ ఏమిటో తెలియకుండానే రాజకీయం చేసిన కేటీఆర్!
రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మూలధనం సమకూర్చేందుకు జారీ చేసిన ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌లను ఆహ్వనించారు. ఇదేదో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి బిడ్ అన్నట్లుగా కేటీఆర్ భారీ లేఖ రాసి తామే బిడ్ దాఖలు చేస్తామని ప్రకటించారు. చివరికి అదంతా పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. పదిహేనో తేదీన బిడ్ల దాఖలకు ఆఖరు రోజున.. కాస్త సమయం కావాలని స్టీల్ ప్లాంట్ అధికారులను సింగరేణి యాజమాన్యం ప్రత్యేకంగా కోరింది. దీంతో మరో ఐదు రోజులు గడువు పొడిగిస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఐదు రోజుల్లోనూ సింగరేణి యాజమాన్యం బిడ్ దాఖలుకు నిర్ణయం తీసుకోలేదు.
బిడ్ దాఖలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని కేసీఆర్ భావించారా ?
ప్రభుత్వం అనుమతి ఇస్తే బిడ్ వేయడానికి సింగరేణి ఏర్పాట్లు రెడీ చేసుకుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. అందుకే బిడ్ దాఖలు చేయడానికి అనుమతించలేదని తెలుస్తోంది. ఒక వేళ సింగరేణికి బిడ్ లభిస్తే.. అందు కోసం కనీసం రూ. ఐదు వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది తెలంగాణలో తెరిపిస్తామని హామీ ఇచ్చిన అనేక పరిశ్రమలను తెలంగాణ సర్కార్ తెరిపించలేకపోయింది. వాటిని తెరిపించకుండా వేలకోట్లను ఏపీలో ఉన్న పరిశ్రమ కోసం తరలిస్తే.. తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ? ఇప్పటికే ఈ అంశంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సింగరేణికి మూలధనం ఇచ్చేంత ధనం ఉంటే.. ముందుగా నిజాం షుగర్స్ ను తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయంగా చిక్కులు వచ్చే పరిస్థితి తలెత్తింది.
రాజకీయంగా అల్లరి అవుతామని తెలిసినా వెనక్కి తగ్గకతప్పలేదు !
ఓ వైపు జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు పొగడ్తలు ఆల్రెడీ ఇచ్చేశారు. విపక్షాలు దమ్ముంటే సింగరేణి బిడ్ వేయాలని చాలెంజ్ చేస్తున్నాయి. అయినా చివరికి బిడ్ దాఖలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంపై రాజకీయంగా అందరూ గేలిచేస్తారని తెలిసినా కేసీఆర్ మౌనంగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారు. దీంతో మొత్తానికి స్టీల్ ప్లాంట్ రాజకీయంలో సింగరేణి ఎపిసోడ్ ముగిసిపోయినట్లయింది. స్టీల్ ప్లాంట్ కు మూలధనం ఇచ్చేందుకు మొత్తం 22 సంస్థలు బిడ్ వేశాయి. ఇందులో ఆరు అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఉక్రెయిన్ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేసింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా బిడ్ దాఖలు చేశారు. ఆయన ఓ చిన్న కంపెనీని భాగస్వామ్యం చేసుకుని బిడ్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.