కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ వెనుకబడిపోయిందన్న ప్రచారాన్ని ఓ వర్గం మీడియా విస్తృతంగా చేస్తోంది. ప్లాన్డ్ గా బీజేపీపై విమర్శలు తగ్గించి కంగ్రెస్ తోనే పోరాటం అన్నట్లుగా కలరింగ్ ఇచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇందుకు దోహదం చేశాయి. అయితే ఢిల్లీలో శనివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాలతో మొత్తం క్లారిటీ వచ్చేసింది. కేటీఆర్ కు అపాయింట్మెంట్ ను అమిత్ షా క్యాన్సిల్ చేయడమే కాదు.. అదే సమయంలో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ తో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి తాము ఎంత సీరియస్ గా ఉన్నామో చేతలతోనే చెప్పారంటున్నారు.
శనివారం క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
తెలంగాణ రాజకీయాల్లో శనివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలను హైకమాండ్ అర్జంట్ గా ఢిల్లీకి పిలిపించింది. అదే సమయంలో కేటీఆర్ .. రాష్ట్రానికి రావాల్సిన నిధుల వేట పేరుతో ఢిల్లీలో ఉన్నారు. కేటీఆర్ కు రాత్రి పది గంటల తర్వాత అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ మీటింంగ్ పై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా కేటీఆర్ అపాయింట్ మెంట్ ను రద్దు చేస్తున్నట్లుగా అమిత్ షా ఆఫీస్ ప్రకటించింది. అమిత్ షా తీరిక లేని కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని అందుకే.. అపాయింట్ మెంట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు కానీ అదే సమయంలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ ఆఫీసులో జరిగిన సమావేశానికి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో పాటు అమిత్ షా కూడా హాజరయ్యారు. నిజానికి వీరు జేపీ నడ్డాతో భేటీ అయినప్పటికీ… అమిత్ షా కూడా .. తెలంగాణ బీజేపీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో చెప్పడానికి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేటీఆర్ తో అపాయింట్ మెంట్ రద్దు చేసి.. తాము రాజీపడబోమని సంకేతాలు ఇచ్చారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పడానికన్నట్లుగా కేటీఆర్ ఢిల్లీ టూర్
బీజేపీతో యుద్ధం ప్రకటించి లేనిపోని మాటలు మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్ ఇటీవల బీజేపీతో పోరాటం అంటూ ఏమీ ఉండదని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఎలాంటి విమర్శలు చేయడం లేదు. బీజేపీతోనే ఉంటామన్నట్లుగా ఆయన సంకేతాలు పంపుతున్నారు . విపక్షాల భేటీ రోజున కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు కాదు ప్రజలు కలవాలని విచిత్రమైన వాదన వినిపించారు. బీజేపీ అగ్రనేతల్ని కలవడం ద్వారా తాము స్నేహంగా ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యూహం ప్రకార .. బీజేపీని దెబ్బకొట్టడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీజేపీ హైకమాండ్ కూడా ప్లాన్ మార్చేసిందని చెబుతున్నారు.
తెలంగాణలో దూకుడు ఖాయమే !
కర్ణాటక ఎన్నికల ఫలితాలు… ఢిల్లీ లిక్కర్ స్కాం వంటి కేసుల్లో సైలెంట్ కావడం.. ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్లిందని.. వాటి వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతోందని… అదే సమయంలో బీఆర్ఎస్ తో సన్నిహితం అవుతున్నారన్న ప్రచారం జరుగుతోందని అమిత్ షా దృష్టికి తెలంగాణ బీజేపీ తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అయితే దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేయడం సాధ్యం కాదని ఏదైనా వారు చేయాలనుకున్నప్పుడు చేస్తారని.. ఈ విషయంలో త్వరలోనే అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయని అమిత్ షా వారి కి భరోసా ఇచ్చి పంపించారని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే బీఆర్ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ తలగడం ఖాయంగా కనిపిస్తోంది.