తెలంగాణ బీజేపీ పక్కా ప్లాన్ – అసెంబ్లీ బరిలో సీనియర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తున్నాయి. అన్ని పార్టీలకన్నా ముందే అధికార పార్టీ బీఆర్ఎస్​ క్యాండిడేట్ల ఫస్ట్​ లిస్ట్​ వారం రోజుల్లో విడుదలయ్యే చాన్స్​ కనిపిస్తున్నది. ఈ నెలాఖరుకే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల ఫస్ట్​ లిస్టు ప్రకటించాలని అనుకున్నా కొన్ని కారణాలతో వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. బీజేపీ జాబితా ప్రకటన ఆలస్యమైనా.. సీనియర్ ​లీడర్లందరూ అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని ఆ పార్టీ హైకమాండ్​ ఇప్పటికే ఆదేశించింది. ఇప్పటికే అన్ని సమీకరణాలను రెడీ చేసుకుని.. త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.

పార్లమెంట్ సభ్యులంతా అసెంబ్లీకి పోీట

బీజేపీ నుంచి లోక్​సభ సభ్యులుగా ఉన్న నలుగురితో పాటు సీనియర్​ నాయకులంతా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. వీరి పేర్లతోనే మొదటి జాబితా ప్రకటించే అవకాశముంది. ఎంపీలు, సీనియర్​ లీడర్లు అసెంబ్లీకి పోటీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్​షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండికేషన్​ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అంబర్ పేట నుంచి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ కరీంనగర్ ​లేదా వేములవాడ నుంచి, ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్​ లేదా కోరుట్ల నుంచి, సోయం బాపూరావు బోథ్ ​నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు !

మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మహబూబ్ నగర్ , షాద్ నగర్‌లలో లో ఏదో ఒక చోటు నుంచి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నుంచి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ​భువనగిరి నుంచి, మాజీ ఎంపీ విజయశాంతి మల్కాజ్​గిరి ఎంపీ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి, బీజేపీ మధ్యప్రదేశ్​ వ్యవహారాల ఇన్​చార్జ్​ మురళీధర్ ​రావు మల్కాజ్​గిరి లేదా కూకట్​పల్లి నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న ఈటల రాజేందర్ (హుజూరాబాద్), రఘునందన్​ రావు (దుబ్బాక) నుంచే పోటీ చేయనున్నారు. బీజేపీలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ చివరి వారంలో, లేదా నవంబర్ ​మొదటి వారంలోనే జరిగే అవకాశముందని అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి.

సెప్టెంబర్ లో భారీగా చేరికలు

తెలంగాణ బీజేపీలో సెప్టెంబర్ నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించబోతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి లేదని.. ఎమ్మెల్యేలపైన మాత్రమే ఉందని చెప్పుకునేలా.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వారంతా.. కేసీఆర్ కు బుద్ది చెప్పేందుకు.. ఇతర పార్టీల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పాతిక మందిపైగా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. వచ్చే నెల నుంచి ఈ చేరికలు బీజేపీలో జోష్ నింపనున్నాయి.