తెలంగాణ బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలగా ఉంది. తెర ముందు నేతలు పోటీ పడి తిరుగుతున్నారు. మరి తెర వెనుక కూడా వార్ రూమ్ లో అద్భుతమైన ఆలోచనలు.. మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ల ఉండాలి. రిటైరైన సివిల్ సర్వీస్ అధికారులకు అంతా అనుభవం ఉంటుంది. ఈవిషయంలో బీజేపీ కోసం పని చేయడానికి ఇద్దరు మాజీ చీఫ్ సెక్రటరీలు సిద్ధమయ్యారు. వారెవరో కాదు.. ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం. మరికొంత మంది సీనియర్ అధికారులు కూడా బీజేపీ కోసం తమ ఆలోచనలు ధారబోస్తున్నారు.
బీఆర్ఎస్ వైఫల్యాలపై పూర్తి సమాచారం వెలుగులోకి !
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచి ఎండగట్టాలనేది బీజేపీ వ్యూహం . . ఈ సమాచారాన్ని సేకరించే బాధ్యతను రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఇచ్చారు. ఆర్థిక, విద్యుత్, నీటి పారుదల శాఖలకు సంబంధించిన కేటాయింపులు, అవకతవకలను తవ్వి తీస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలపై ఏమాత్రం ఖర్చు చేసిందనే విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని బీజేపీ వ్యూహ రచన చేసింది.
రిటైరైన సీనియర్ అధికారులతో ఓ కమిటీ
తెలంగాణ బీజేపీ కోసం పని చేస్తున్న వారిలో ఇద్దరు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. ఒకరు ఐవైఆర్ కృష్ణా రావు కాగా, మరొకరు ఎల్వీ సుబ్రమణ్యం. మొత్తం 20 మంది ప్రముఖులు ఈ వ్యూహానికి తగిన సమాచారాన్ని అందించనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి టి కృష్ణ ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్. చంద్రవదన్, ఏపీ పోలీస్ మాజీ ఉన్నతాధికారి ఎస్కె జయచంద్ర, లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ సోదరుడు, అడ్వకేట్ నాగేంద్ర ఈ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ డేటా సేకరణ పనిని బీజేపీ మొదలుపెట్టింది. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మిషన్ లో కీలకంగా ఉన్నట్లుగా చెబుతున్నారు
తెలంగాణలో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల పర్యటన
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలో పర్యటించనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కమలం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించేలా అధిష్ఠానం ప్రణాళిక రూపొందించింది. ఏ నియోజకవర్గంలో ఉండాలి? ఏం చేయాలి? వంటి అంశాలపై ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలకు సమాచారాన్ని అందజేసింది. 119 నియోజకవర్గాల్లో నాలుగు నెలల పాటు విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.