ఏపీ పేదలకు తొమ్మిదేళ్లలో కేంద్రం పాతిక లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్లు కట్టుకోలేని నిరుపేదలకు వీటిని ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంది. కట్టడానికి నిధులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు ఏం చేశాయి.. నిధుల్ని దుర్వినియోగం చేశాయి. ఇళ్లు కట్టాయా అంటే కట్టనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. కేవలం 19 శాతం ఇళ్లనే తొమ్మిదేళ్లలో కట్టారు. ఈ లెక్కలను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బయటపెట్టారు.
కేంద్రం ఇళ్లపై పాలకుల నిర్లక్ష్యం
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు ఉండాలని..దేశంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల మీదుగా నడుస్తుంది. ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ప్రభుత్వాలు నిధుల్ని మింగేసి అరకొర పనులతో సరిపెట్టాయి. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో హ డావుడి చేసింది. అవి అందుకున్న వారు లేరు. మొత్తంగా ప్రభుత్వం ఇచ్చిన 25 లక్షలు ఇళ్లలో 19% మాత్రమే రెండు పార్టీలు నిర్మాణం చేశారు .
అప్పట్లో టిడ్కో ఇళ్లు – ఇప్పుడు సెంట్ స్థలాలు
టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో హడావుడి చేశారు. కానీ పూర్తి చేయక ముందే ఓడిపోయారు. నిధులన్నీ తీసుకుని ఖర్చు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లను పట్టించుకోకుండా.. సెంట్ స్థలాల పంపిణీ చేపట్టింది. ఈ ఇళ్ల నిర్మాణం ఎక్కడిదక్కడే ఉండిపోయింది. కాలనీలు కడుతున్నామని చెప్పారు కానీ ఎక్కడా నిర్మాణం చేయలేదు. కానీ నిధులన్నీ అయిపోయాయి. ఇప్పుడు పేదలకు ఇల్లు రాలేదు..ఆ సెంట్ స్థలం కూడా ఎందుకూ పనికి రాలేదు.
మళ్లీ చాన్సివ్వాలా ?
బీజేపీ పాలిత రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మించాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికర గణాంకాలతో కూడిన మ్యాప్ ద్వారా విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని.. కేంద్రం నిధులు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే వైసీపీ, టీడీపీ పార్టీలు పేదలకు ఇల్లు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నేడు మళ్ళీ ఒక్కసారి అవకాశం అంటున్నారని విమర్శించారు. పేద ప్రజల వ్యతిరేక పార్టీలనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలన్నారు. పేద ప్రజలకు జగన్, చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.