భారతీయ జనతా పార్టీకి రెండు సార్లు ఫుల్ మెజార్టీ వచ్చింది. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్నే కొనసాగిస్తున్నారు. కేబినెట్ లో బీజేపీ మంత్రులే కాకుండా మిత్రపక్షాలకూ అవకాశం కల్పిస్తున్నారు. కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా నేషనల్ డెమెక్రటిక్ ను బలోపేతం చేయాలనుకుంటున్నారు. పద్దెనిమిదో తేదీన ఢిల్లీ అశోకా హోటల్ లో ఎన్జీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎన్డీఏకి మమ్మల్ని పిలిచారని టీడీపీ.. మమ్మల్ని పిలుస్తారని వైసీపీ ప్రచారం చేసుకుంటున్నాయి.
బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తున్న వైసీపీ
2018 లో టీడీపీ దూరం అయినప్పటి నుంచి వైసీపీ బీజేపీకి దగ్గరయింది. 2019 ఎన్నికలకు అది బలపడింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్లు వ్యతిరేకించిందే లేదు. ఎన్డీఏలోకి వస్తామని వారు బీజేపీ పెద్దలని కోరుతున్నారు. జగన్ మెహనరెడ్డి పర్యటనలో దానిపైనే ఫైనల్ సిట్టింగ్ జరిగినట్లుంది. అందుకే ఎప్పుడూ జరిగే దానికంటే ఎక్కువ సేపు సమావేశాలు జరిగాయి. అమిత్ షా, ప్రధానిమోదీ తో జరిగిన బ్యాక్ టు బ్యాక్ మీటింగ్ లలో దీనిపైనే ఎక్కువ ఫోకస్ జరిగినట్లు సమాచారం ఉంది. ఏం జరుగుతుందో కానీ.. వైసీపీ నేతలు మాత్రం తాము బీజేపీకి మిత్రపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
చిటికేస్తే బీజేపీ కూటమిలో చేరనున్న టీడీపీ
నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత పవర్ ఫుల్ గా ఉన్న టైంలో ఆయనతో విబేధించి.. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి.. మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్ లోనూ.. ఢిల్లీ వీధుల్లోనూ గర్జించింది.. తెలుగుదేశం. కానీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వ సహకారం వైసీపీ పొందడం.. తనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావడం దెబ్బతీసిందని నిర్థారణకు వచ్చిన చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించడం తగ్గించారు. రాను రాను సానుకూలత చూపారు. మేం లైక్ మైండెట్ అంటూ సిగ్నల్స్ పంపారు. అటు టీడీపీకి శాశ్వతంగా తలుపులు మూశాం అని చెప్పిన బీజేపీ కొద్దిగా తలుపులు తెరిచింది. ఆప్షన్ లోకి టీడీపీని తీసుకొచ్చింది. చంద్రబాబుతో మంతనాలు జరిపింది.
రాజకీయ వ్యూహాల ప్రకారమే బీజేపీ నిర్ణయాలు
ప్రస్తుతానికి బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రెండు పార్టీలు తనతో కలవడానికి ఉన్న అనివార్యతలను వినియోగించుకునే పరిస్థితులోనే ఉంది. పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఎవరు ఇచ్చే అవకాశం ఉందన్న ఆప్షన్ కూడా చూస్తారు.ఇప్పటికైతే.. టీడీపీ ఢిల్లీ మీటింగ్ ను అధికారికంగా ధృవీకరించలేదు. బీజేపీ కూడా పిలిచామని చెప్పడం లేదు. కానీ బీజేపీ తమ కూటమిలోకి ఏ పార్టీ కావాలని కోరుకుంటే.. ఆ పార్టీ ఎన్డీఏలోకి ఏపీ నుంచి వస్తుందనేది అందరూ అంగీకరించాల్సిన నిజం.