భారతీయ జనతా పార్టీ ఏపీలో పొత్తుల అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని..జనసేన ఎన్డీఏలో ఉందని బీజేపీ నేతలు నిర్మోహమాటంగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ జనసేన మత్రం టీడీపీతో సీట్ల సర్దుబాటు చర్చలు కూడా పూర్తి చేసుకుంది. బీజేపీ కూడా కలసి రావాలని బహిరంగంగా పవన్ కల్యాణ్ అడుగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. తర్వాత ఏం జరిగిందో స్పష్టత లేదు.
బీజేపీ హైకమాండ్ నుంచి రాని స్పందన
గతంలో కూడా చంద్రబాబు ఓ సారి ఢిల్లీ వెళ్లి అమిత్ షా , జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ వివరాలు బయటకు రాలేదు. ఈ సారి కూడా మీటింగ్ వివరాలు బయటకు రాలేదు. ఖచ్చితంగా రాజకీయాలు, పొత్తులపైనే చర్చలు జరిగాయని చెప్పాల్సిన పని లేదు. ఈ చర్చలు జరిగిన తర్వాతనే అమిత్ షా ఎన్డీఏలోకి కొత్త్ పార్టీలు వస్తున్నాయని ఏపీలో పొత్తుల సంగతి త్వరలో తేల్చేస్తామని ప్రకటించారు. అయితే ఆయన టీడీపీ కూటమిలోకి వస్తుందని చెప్పలేదు. ఆ తర్వాత సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆయన కూడా రాజకీయాలపైనే చర్చించి ఉంటారు. ఏ ప్రతిపాదనలు పెట్టారన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.
టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా నష్టపోయిన బీజేపీ
2014లో పొత్తుతో అధికారంలో బీజేపీ భాగం పంచుకుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేసి, క్రమంగా తన సొంతబలాన్ని పెంచుకుంటూ పోయింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి సాగించిన ప్రయాణం బీజేపీకి ఏమాత్రం మేలు చేయలేకపోయింది. 1998లో తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఏపీలో 2 పార్లమెంట్ సీట్లు గెలుపొందిన బీజేపీ, 1999లో టీడీపీతో పొత్తు ద్వారా రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి సీట్లను గెలుపొందింది. కానీ ఆ తర్వాత ఆ బలాన్ని కొనసాగించలేకపోయింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా.. ఆ తర్వాత జనసేన పార్టీతో కలిసినా బీజేపీ పార్టీ పరిస్థితి ఇంచ్ కూడా మెరుగుపడలేదు. టీడీపీ వ్యూహాత్మక నిర్వీర్యం చేస్తుందని పొత్తు లేకపోతే తెలంగాణ, తమిళనాడు లో ఎదిగినట్లుగా ఎదగవచ్చని భావిస్తున్నారు.
త్వరలో బీజేపీ హైకమాండ్ నిర్ణయం
బీజేపీ భారీ సీట్లు డిమాండ్ చేస్తూ ఉండవచ్చన్న విశ్లేషణలు జాతీయ మీడియా చేస్తోంది. కూటమిలో గెలుపు అవకాశాల్ని బట్టే పోటీ చేయాలన్న ఫార్ములాకు కట్టుబడి ఉండాలని బీజేపీ భావిస్తున్నట్లుాగ తెలుస్తోంది. ఎక్కువ తక్కువ ప్రాధాన్యతలు .. పట్టదల.. పంతాలు కాకుండా రియాలిటీతో సీట్ల సర్దుబాటు చేసుకుంటే బెటరని సూచిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. మిత్రపక్షాలకు.. కొన్ని సీట్లు ఇస్తాం.. వాటిలోనూ అభ్యర్థులను పెడతాం అన్న రాజకీయాలు చేస్తామంటే కుదరదని చెబుతున్నారు. అందుకే ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.