తెలంగాణ రాజకీయాల్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు వివిధ కారణాలు చూపి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. బీఆర్ఎస్ లో స్థిరపడిన వారు స్థిరపడిపోగా మిగిలిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారికి సీట్లు కేటాయించేదుకు కూడా సిద్ధమయ్యారు.
కాంగ్రెస్‌లోకి తుమ్మల , మండవ
తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం టిక్కెట్ కేటాయించారు. నిజానికి ఆయన పాలేరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అది సంప్రదాయకంగా రెడ్డి సామాజికవర్గం సీటు. అందుకే ఖమ్మం నుంచి పోటీ చేయాలని సూచించారు. దానికి తుమ్మల అంగీకరించారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయనున్నారు. ట్విస్ట్ ఏమిటంటే రాజకీయాలకు దూరంగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయనకు నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం మండవ బీఆర్ఎస్ లో ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కవిత గెలుపు క్లిష్టంగా మారిందని … ఆయనను ఇంటికెళ్లి మరీ కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అయినా కవిత ఓడిపోయిది. మండవను కేసీఆర్ పట్టించుకోలేదు.
నిజామాబాద్ రూరల్ మాజీ టీడీపీ నేతకేనా ?
ఇప్పుడు పిలిచి మరీ కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుంది. నిజామాబాద్ రూరల్ లో భాగమైన డిచ్ పల్లి నుంచి మండవ నాలుగుసార్లు… నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి ఒక సారి మండవ గెలిచారు. ఉద్యమ ఎఫెక్ట్ తో గత రెండు సార్లు బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచారు. కాంగ్రెస్ కు అక్కడ బలమైన అభ్యర్థి లేరు. డీఎస్ కుమారుడి పేరును పరిశీలిస్తున్నారు. కానీ మండవ అయితే కరెక్ట్ అని నిర్ణయానికి వచ్చి టిక్కెట్ ఆఫర్ చేశారు. క్లీన్ ఇమేజ్… తో పాటు గ్రామ గ్రామాన పరిచయస్తులు ఉండటంతో కాంగ్రెస్ ఆయనకు టిక్కెట్ ఇవ్వాలనుకుంటోంది.
వీరందరూ కాంగ్రెస్ లో చేరాలనుకోవడం వెనుక అదృశ్య శక్తి ఉందా?
వీరందరూ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లో చేరాలనుకోవడం వెనుక ఓ అదృశ్య శక్తి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఊపిరిపోతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి కొన్ని రకాల ప్రయత్నాలు కీలక నేతలు చేస్తున్నారని.. వారు కాంగ్రెస్ కు చెందిన వారు కాదని అంటున్నారు. మొత్తంగా టీడీపీ నేతలందర్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పంచుకోవడం ఆసక్తకిరంగా మారింది.