ఏపీ పొత్తులపై బీజేపీ హైకమాండ్ నిరాసక్తత – ఒంటరి పోటీకే మొగ్గు ?

ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లుగా లేదు. బీజేపీ నుంచి స్పందన లేకపోవడంతోనే టీడీపీ, జనసేన సీట్లను ప్రకటించాయని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. పొత్తుల విషయంలో అంత ఆసక్తి గా లేకపోవడం ప్రధాన కారణం అయితే.. కాస్త ఆలోచించింది కూడా పవన్ కల్యాణ్ ఒత్తిడితోనేనని ఇప్పుడు.. ఆ అవకాశం కూడా లేదని అంచనా వేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల కసరత్తులో బిజీగా కేంద్ర నాయకత్వం

బీజేపీ పెద్దలు ఏపీ గురించి ఆలోచించలేకపోతున్నారు. ఏపీలో పొత్తుల అంశం తేల్చడానికి కూడా వారికి తీరిక ఉండటం లేదు. పొత్తులు పెట్టుకుంటే… నాలుగైదు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తామని జనసేన, టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అంతకు మించి ప్రయోజనం కనిపించడం లేదు. ఏపీ గురించి సమావేశాలు పెట్టేంత తీరిక ప్రస్తుతానికి బీజేపీ పెద్దలకు లేదు. దేశం మొత్తం ఎన్నికల ప్రణాళికల్లో ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వస్తే.. మొదటి విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు పూర్తయిపోతాయి. అందుకే… మరో వారంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనా ఉంది.

టీడీపీని నమ్మలేకపోతున్న బీజేపీ

నిజానికి బీజేపీ నాయకత్వం పొత్తుల విషయంలో .. మిత్రపక్షాలను కలుపుకునే విషయంలో కీలకంగానే ఉంటోంది. కానీ టీడీపీ విషయానికి వచ్చే సరికే కాస్త సందిగ్ధంగా ఉంటోంది. దీనికి కారణం ఆ పార్టీతో గతంలో ఎదుర్కొన్న అనుభవాలే. ఈ సారి కూడా టీడీపీని నమ్మడం ఎందుకన్న ఆలోచనలో హైకమాండ్ ఉందంటున్నారు. అందుకే రెండు సార్లు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయినా నిర్ణయం తీసుకోలేదన్న వాదన వినిపిస్తోది.

వైసీపీకి అండగా రాజ్యసభ సీట్లు

బీజేపీకి ఇప్పటికిప్పుడు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా.. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వారు బీజేపీకి షరతులు లేకుండా మద్దతు ఇస్తారు. అదే టీడీపీ కూటమిలో బీజేపీ ఉంటే.. వైసీపీ అలా చేయకపోవచ్చు. ఈ కోణంలో కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు. పొత్తుల విషయంలో బీజేపీ ఆలోచనలేమిటన్నది త్వరలోనే తేలే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితులు చూస్తూంటే ఒంటరి పోటీకే మొగ్గు చూపుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చంటున్నారు.