సీట్ల సర్దుబాటు అంత వీజీ కాదు – టీడీపీ, జనసేన పొత్తులు ఎంతో క్లిష్టం

టిడిపి, జనసేన మధ్య పొత్తు ఖరారైంది. వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో టిడిపి, జనసేన పొత్తుపై దిగువస్థాయిలో ఆయా పార్టీల శ్రేణుల్లో నెలకొన్న సందేహాలు పటాపంచలయ్యాయి. దీనికి బిజెపి కలిసొస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ బిజెపి రాకపోయినా టిడిపితో పొత్తు ఖాయమన్నట్లు పవన్‌ చేసిన ప్రకటన టిడిపి శ్రేణుల్లో ఉత్సాహన్నిచ్చింది.

భయపడుతూ ఉన్న టీడీపీ శ్రేణులకు జనసేనాని భరోసా

చంద్రబాబు అరెస్టు నేపథ్యం దగ్గర నుంచి జనాల్లో సానుభూతి ఉన్నా ప్రభుత్వ నిర్బంధం, ఇతర కారణాల రీత్యా టిడిపి శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అక్కడికీ పోలీసు నిర్బంధానికి ఎదురొడ్డుతూ కొన్నిప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. చంద్రబాబుకు రిమాండ్‌, ఆపై బెయిల్‌ రాకపోవడం, లోకేష్‌ను సైతం అరెస్టు చేస్తారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఒకింత అలజడి నెలకొంది. ఈ క్రమంలో జనసేనాని పొత్తు ప్రకటనతో టిడిపి శ్రేణులకు ఉత్సాహంతోపాటు ధైర్యాన్నిచ్చిందని అనుకోవచ్చు.

జనసేన బలంగా ఉన్న స్థానాల్లో సీట్ల సర్దుబాటు కష్టమే

పవన్‌ కల్యాణ్‌ ప్రకటనతో జిల్లాలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో ఒకరకమైన జోష్‌ నెలకొంది. జనసేనకు ఉన్నంతలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లాల్లో సీట్ల సర్దుబాటు కష్టంగా ఉండేది. పలు నియోజకవర్గాల్లో కాపు సామాజిక తరగతి ఓట్లు ఎక్కువగా ఉండటం, వారితో ఎక్కువ శాతం జనసేనకు అండగా ఉంటున్న పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి స్పష్టంగా కన్పిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలంగా ఉన్న చోట్ల టిడిపి, జనసేన పరస్పర అవగాహనతో పోటీకి దిగడం కూడా వైసిపికి గట్టిపోటీనిచ్చినట్లయ్యింది.

జనసేన రెండో స్థానంలో ఉన్న సీట్లన్నీ ఆ పార్టీకే

గత సాధారణ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పటికీ జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు వంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం చూపింది. నాడు వామపక్షాల సహకారంతో పలు నియోజకవర్గాల్లో టిడిపిని వెనక్కినెట్టి రెండోస్థానంలో జనసేన నిలిచిన పరిస్థితి ఉంది. టిడిపి, జనసేన పొత్తు ఖాయమని పవన్‌ ప్రకటించడంతో ఇప్పుడు అందరూ సీట్లపై మాట్లాడుకుంటున్నరు. సీట్ల సర్దుబాటు విషయంలో రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.