ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాట అత్యంత పవర్ ఫుల్ నేతగా కనిపిస్తున్నారు. ఇప్పుడాయన కేబినెట్ మార్పులు కూడా చేస్తున్నారు. స్టాలిన్ సకెస్ కంటే విపక్షాల ఫెయిల్యూర్ ఎక్కువగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అధికార డీఎంకే కంటే కూడా శక్తిమంతమైన అన్నాడీఎంకే మూడు ముక్కలై కూనారిల్లుతోంది. అధికార పార్టీని కొట్టాలంటే తొలుత అన్నాడీఎంకేలో ఐక్యత సాధించడం అనివార్యం…
దినకరన్ తో పన్నీర్ భేటీ
ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) రెండు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. శశికళ కోసమే కాదు ఎవరి కోసమూ పదవిని వదులుకునేది లేదని భీష్మించుకు కూర్చున్న నాయకుడు ఆయన. శశికళను గట్టిగా వ్యతిరేకించిన ఓపీఎస్.. ఇప్పుడు శశికళ కుటుంబాన్నే ఆశ్రయిస్తున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాటి పళణిస్వామి (ఈపీఎస్) దెబ్బకు ఆయనకు దిమ్మతిరిగింది. దానితో శశికళ బంధువైన అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అధ్యక్షుడు టీటీవీ దినకరన్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గతాన్ని తవ్వుకోకుండా ఇద్దరం కలిసి పనిచేయాలని ద్రవిడ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు..
శశికళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. ?
నిజానికి ఓపీఎస్, టీటీవీ ఇప్పుడు రాజకీయంగా బలహీన పడ్డారు. 2019 ఏఎంఎంకే 5 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 శాతం పొందింది. అవి కూడా సంప్రదాయ అన్నాడీఎంకే ఓట్లని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులో బలపడాలంటే కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు.
2022లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఓపీఎస్ కొత్త అవకాశాల కోసం వెదుక్కుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం కూడా ఓపీఎస్ వైపే మొగ్గు చూపడంతో ఇతరులను కలుపుకుపోవడం, లేదా కలిసిపోవడం మినహా ఆయనకు వేరు గత్యంతరం కనిపించడం లేదు. జయలలిత ఆస్తుల కేసులో జైలు శిక్ష తర్వాత ఖాళీగా ఉంటున్న శశికళ కూడా వీరికి సపోర్టు చేసే అవకాశాలున్నాయి. పైగా ముగ్గరూ ముక్కుళత్తూరు అంటే తేవర్ సామాజిక వర్గానికి చెందిన నేతలు. దక్షిణ తమిళనాడులో బలమైన సామాజిక వర్గమైన తేవర్లు.. ఈపీఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దానితో ఈ ముగ్గురు కలిస్తే అన్నాడీఎంకే శ్రేణులన్నీ వీరివైపుకు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు..
బీజేపీ చొరవ చూపిందా..
ఓపిఎస్, టీటీవీ భేటీకి బీజేపీ చొరవ చూపినట్లు భావిస్తున్నారు. గతంలో ఓపీఎస్, ఈపీఎస్ ను దగ్గరకు చేర్చి అన్నాడీఎంకేలో సంక్షోభం ఏర్పడకుండా, ప్రభుత్వం కూలిపోకుండా బీజేపీ చర్యలు తీసుకుంది. తర్వాత ఇరు వర్గాలు అంతర్గత కుమ్ములాటతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ఐనదానికి కానిదానికి బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మతవాదమంటూ ఆరోపణలు సంధిస్తున్నారు..
అన్నాడీఎంకేలోని అన్ని గ్రూపులను ఒకటిగా చేసి, పీఎంకెను, బీజేపీని కలిపుకుని బరిలోకి దిగితే 2024 లోక్ సభ ఎన్నికల్లో అన్ని 39 స్థానాలను గెలుచుకోవడం కష్టమేమీ కాదని కమలం పార్టీ పెద్దలు విశ్లేషించుకుంటున్నారు. ఆ పని జరుగుతుందన్న నమ్మకమూ కమలనాథులకు ఉంది..