కిడ్నీలో రాళ్లున్నాయని హెచ్చరించే లక్షణాలివే!

కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నవారి బాధ వర్ణణాతీతం. పొత్తి కడుపులో నొప్పి, యూరిన్‌కు వెళ్లాలంటే మంట వేధిస్తూ ఉంటుంది. మహిళలతో పోలిస్తే పురుషులకు కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఓసారి రాళ్లు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్లీ తిరగబెట్టే అవకాశం లేకపోలేదు. అందుకే మందులతో కాకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి.

కిడ్నీలో రాళ్లెందుకు ఏర్పడతాయి
నీళ్లు తక్కువగా తాగడం, మాంసాహారం ఎక్కువగా తినడం, స్టెరాయిడ్‌లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం, శరీరంలో విటమిన్‌ బి6, సి లోపం ఉన్నా, విటమిన్‌ డి అధికంగా ఉన్నప్పుడు, ఆల్కహాల్‌ ఎక్కువగా తాగే వారికి, కిడ్నీ ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా సోకుతున్నా, ఆలస్యంగా భోజనం చేసినా.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కిడ్నీలో కాల్షియం అక్సినేట్‌, కాల్షియం ఫాస్పేట్‌ ఇలా రెండు రకాల రాళ్లు ఉంటాయి. మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల తలెత్తే స్ఫటికాలు కిడ్నీలో రాళ్లకు దారితీస్తాయి.

కిడ్నీలో రాళ్లుంటే కనిపించే లక్షణాలు
కిడ్నీలో రాళ్లుంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ భాగంలో నొప్పి వ‌స్తుంటుంది. లేదంటే ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు ఉన్నట్లు ఉంటుంది. ఇది ఎక్కువైతే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. మూత్రం విసర్జించే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి. ఇంకా వాంతి వ‌చ్చిన‌ట్లు ఉండ‌టం, వికారం, వ‌ణ‌ుకు, జ్వరం వంటి ల‌క్షణాలు ఉంటే… కిడ్నీలో రాళ్లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. అయితే కేవలం మందుల ద్వారా రాళ్లు కరిగించుకుంటామంటే అది శాశ్వత పరిష్కారం కాదు, మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి.

కిడ్నీలో రాళ్లను ఇలా కరిగించుకోవచ్చు
నీరు ఎక్కువ తాగాలి
నీరు ఎక్కుగా తాగితే రాళ్లు ఏర్పడటానికి దారితీసే పదార్థాలు పలుచగా అవుతాయి. దీంతో ఇవి మూత్రంతో పాటు తేలికగా బయటకు వచ్చేస్తాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిది. మీ డైట్‌లో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి.

సరిపడా కాల్షియం
మీ డైట్‌లో కాల్షియం అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకపోతే యూరిన్‌లో ఆక్జలేట్‌ స్థాయులు పెరిగి రాళ్లు ఏర్పడొచ్చు. కాల్షియం పేగులలో ఆక్సలేట్‌ను బంధిస్తుంది, దాన్ని ఎక్కువగా గ్రహించకుండా నియంత్రిస్తుంది. కాబట్టి వయసుకు తగినట్టుగా క్యాల్షియం తీసుకునేలా చూసుకోవాలి.

నాన్‌వెజ్‌ తగ్గించాలి
మాంసం, చికెన్‌, గుడ్లు, సముద్ర రొయ్యలు, చేపల వంటి నాన్‌వెజ్‌ ఆహారం నుంచి వచ్చే ప్రొటీన్‌ను యానిమల్‌ ప్రొటీన్ అంటారు. ఈ ప్రోటీన్‌.. మూత్రంలో యూరిక్‌ యాసిడ్‌ ను పెంచుతుంది. దీంతో కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది. ప్రోటీన్‌ను మరీ ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడకుండా చూసే సిట్రేట్‌ స్థాయులు కూడా పడిపోతాయి.

ఉప్పు తగ్గించండి
సోడియం ఎక్కువగా తీసుకుంటే యరిన్‌లో క్యాల్షియం స్థాయులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది. రోజుకు 2,300 మిల్లీగ్రాముల సోడియం తీసుకోవచ్చు. సోడియంతో కిడ్నీ రాళ్లు ఏర్పడే స్వభావం గలవారైతే రోజుకు 1,500 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి.

నిమ్మరసం తాగండి
కిడ్నీలో రాళ్లు నివారించడానికి నిమ్మరసం తాగితే మంచిది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ కాల్షియంను బంధించి, రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.

వీటికి దూరంగా ఉండాలి
బీట్‌రూట్‌, చాక్లెట్‌, పాలకూర వంటి ఆహారపదార్థాల్లో ఆక్జలేట్‌ అధికంగా ఉంటుంది. ఆక్జలేట్‌ కిడ్నీలో రాళ్లకు దారితీస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

యాలకుల వాటర్
యాలకుల్లోని గింజలను పొడిగా చేసి, ఒక గ్లాసు నీటిలో 1 స్పూన్ పొడిని కలపండి. స్పూన్ చక్కెర, కొన్ని పుచ్చకాయ గింజలను ఆ నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…