సువేందు కుటుంబం వర్సెస్ తృణమూల్….

ఒక నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ ను మాత్రమే కాకుండా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ముఖ్యమంత్రి మమతకు అత్యంత సన్నిహితుడై, ఇప్పుడు ఆమెకు బద్ధ శత్రువుగా మారిన సువేందు అధికారి కుటుంబానికి ఆ నియోజకవర్గం కంచుకోట కావడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. పశ్చిమబెంగాల్ లోని కాంథీ ప్రాంతం ఓటింగ్ సరళిపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు…సువేందు బీజేపీలో ఉండటం కూడా ఒక కారణమని చెప్పాలి.

సువేందు సోదరుడు పోటీ…

తూర్పు మెద్నీపూర్ ప్రాంతంలో ఉన్న కాంథీ లోక్ సభా నియోజకవర్గంలో ఈ సారి సువేందు అధికారి సోదరుడు సోమేందు అధికారి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. తృణమూల్ తరపున ఉత్తమ్ బారిక్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉర్వశీ భట్టాచార్య బరిలోకి దిగారు. కాంథీ నియోజకవర్గం కోసం సీఎం మమతా బెనర్జీ చాలా పనులు చేసిన మాట వాస్తవమేనని అయితే దాదా అంటే సువేందు అధికారి పట్ల తమకు అభిమానమని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

తృణమూల్ అవినీతే ప్రచారాస్త్రం

మమత నాయకత్వంపై కాంథీ నియోజకవర్గం ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే అక్కడ జరిగిన అవినీతి, తృణమూల్ నేతల అరాచకాన్ని మాత్రం వాళ్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టిన మమత, అవినీతిని అంతమొందించడానికి కూడా అదే రేంజ్ లో దృష్టి పెడితే బావుండేదంటున్నారు. రోటీ, కప్డా, ఔర్ మకాన్ అంటే కూడు, గూడు, గుడ్డ అందించే ఎంపీ కావాలని అది సువేందు కుటుంబం వల్లే సాధ్యమని సగటు ప్రజలు వాదిస్తున్నారు. ఒక వర్గం ప్రజలు దీదీకి ఓటెయ్యాలనుకోవడం నిజమే అయినా, కేంద్రంలో మోదీ సర్కారు చేపట్టిన పనులు చూసి తాము బీజేపీకి ఓటేస్తామని మెజార్టీ వర్గం అంటోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నందున తాము జాతీయ స్థాయిలో ఆలోచిస్తామని కూడా చెబుతున్నారు..

కీలక పదవులు నిర్వహించిన సువేందు కుటుంబం

సువేందు అధికారి కుటుంబం సభ్యులు కాంథీలో అనేక పదవులు నిర్వహించారు. ఆయనతో పాటు సోదరులు దిబ్యేందు, సోమేందు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సువేందు తండ్రి సిసిర్ అధికారి తృణమూల్ తరపున పోటీ చేసి గెలిచారు. మారిన పరిణామాల్లో ఆయన కూడా బీజేపీలోకి వచ్చేశారు. 23 ఏళ్ల పాటు తృణమూల్ కు విధేయతగా ఉన్న ఆ కుటంబం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపుకు వచ్చేసింది. 2009,2014లో కూడా సిసిర్ అధికారి తృణమూల్ తరపున లోక్ సభకు ప్రాతినిధ్య వహించారు. ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లున్న కాంథీ లోక్ సభా నియోజకవర్గంలో శనివారం పోలింగ్ జరుగుతుంది…