కర్ణాటక ఓటర్లు కమలం వైపే మొగ్గు చూపుతున్నారు. బీజీపీ మాత్రమే ప్రజారంజక పాలన అందించగలదన్న అభిప్రాయంతో ఉన్నారు. మోదీ నాయకత్వానికి జై కొడుతూ బసవరాజ్ బొమ్మాయ్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు..
న్యూస్ 18 కన్నడ సర్వే..
ఎన్నికలు వచ్చాయంటే సర్వేలు చేసి జననాడి తెలుసుకోవడం సాధారణ విషయం. ఇప్పుడు సర్వేలు చేసే సంస్థలు కూడా పెరిగాయి. తొలుత కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ప్రకటించాయి. పోగా పోగ వాస్తవ స్వరూపం బయట పడుతోంది. తొందరపడకుండా ప్రజల ఆలోచనా విధానాన్ని సక్రమంగా అర్థం చేసుకున్న నిజమైన సర్వేలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.
న్యూస్ 18 కన్నడ ఛానెల్ మార్చి 1 నుంచి ఏప్రిల్ 20 వరకు రాష్ట్రంలోని నలుదిక్కులా, అన్ని వర్గాలను సర్వే చేసి ఓ రిపోర్టు రూపొందించింది. దాని ప్రకారం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో బీజేపీకి 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించబోతోంది. కాంగ్రెస్ కు 87 స్థానాలు వస్తాయి. దేవెగౌడ ఆయన కుమారుడు కుమారస్వామి నిర్వహించే జేడీఎస్ కు 32 స్థానాలు దక్కుతాయి. బీజేపీకి 39 శాతం, కాంగ్రెస్ కు 38 స్థానాలు, జేడీఎస్ కు 19 శాతం ఓట్లు వస్తాయి.
జీ న్యూస్ మ్యాట్రిడ్జ్ సర్వే
జీ న్యూస్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీకే ఎడ్జ్ కనిపించింది. తాజాగా నిర్వహించిన ఆ సర్వే ప్రకారం బీజేపీకి 103 నుంచి 115 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ కు 79 నుంచి 91 స్థానాలు రావచ్చు, జేడీఎస్ కు 26 నుంచి 36 స్థానాలు వచ్చి కింగ్ మేకర్ గా మారడం ఖాయమని తేలిపోయింది. బీజేపీకి 115 స్థానాలు వచ్చిన పక్షంలో కనీస మెజార్టీ అయిన 113ని దాటినట్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేనిపక్షంలో హంగ్ అసెంబ్లీ ఖాయం.
జీ న్యూస్ మ్యాట్రిడ్జ్ సర్వే ప్రకారం బీజేపీకి 42 శాతం, కాంగ్రెస్ కు 40 శాతం, జేడీఎస్ కు 15 శాతం ఓట్లు వస్తాయి. ఇతరులు 3 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారు. లక్షా 80 మంది పురుషులు, లక్షా 12 వేల మంది మహిళలను సర్వే చేసిన తర్వాత ఈ రిపోర్టు రూపొందించామని జీ న్యూస్ వెల్లడించింది..బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోయినా కొన్ని చోట్ల కమలం పార్టీ పట్ల ఉన్న విశ్వాసం కారణంగా ఎక్కువ స్థానాలు వస్తున్నాయని తేల్చారు. బొమ్మాయ్ ముఖ్యమంత్రి కావాలని ఎక్కువ మంది కోరుకుంటుండగా, సిద్దరామయ్యకు సెకెండ్ ప్లేస్, కుమారస్వామికి థర్డ్ ప్లేస్, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు ఫోర్త్ ప్లేస్ వచ్చింది.
మోదీ వరం, ఖర్గే శాపం..
ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి పట్టుకొమ్మ అని సర్వేలో పాల్గొన్న వారంతా అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, మోదీ చూపుతున్న చొరవకు కన్నడీగులు ఫిదా అయిపోయారని రెండు సర్వేలు నిగ్గు తేల్చాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని సర్వేలు పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. మల్లికార్జున్ ఖర్గే తీరుపై కన్నడీగులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని పట్టుకుని విషనాగు అని ఆయన ఎలా అంటారని సగటు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో మర్యాదలు తెలియాలని కుసంస్కారాన్ని ప్రదర్శించడం తగిన పద్ధతి కాదని జనం అభిప్రాయపడుతుున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి….