సమ్మర్ వచ్చేస్తోంది …ఇల్లు చల్లగా ఉండాలంటే ఇలా చేయండి!

సమ్మర్ వచ్చేస్తోంది..ఈ ఏడాది ఎండలు ఠారెత్తిపోవడం ఖాయం అని ఇప్పటి నుంచే అర్థమైపోతోంది. సాధారణంగా రథసప్తమి నుంచి వాతావారణంలో చిన్నగా మార్పు మొదలై శివరాత్రి తర్వాత నుంచి కొంచె కొంచెం మారుతుందని ఆ తర్వాత సూర్యుడు మంటపెడతాడని చెబుతారు. కానీ ఈ ఏడాది వేడి ముందే మొదలైంది. శివరాత్రి రాకముందే సమ్మర్ వచ్చేసింది. ఇంట్లో కూలర్లు, ఏసీలు వేసుకోకుండా ఉండలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయ్. అందుకే చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటే మీ ఇల్లు చల్లగా ఉంటుంది.

సాధారణంగా వేడి తగ్గించుకునేందుకు మట్టి, వెదురు, గడ్డి లాంటివి వినియోగిస్తారు. మరికొందరు ఆధునికి పద్ధతుల్లో ఇన్సులేటెడ్ గోడలు, ప్యానెళ్లతో ఇంటిని చల్లబరుచుకుంటున్నారు. ఇక ఏసీలు వాడి ఇల్లు చల్లబర్చుకునేవారి సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ సమయం ఏసీల్లో ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే కొన్ని మార్గాలు సూచిస్తున్నారు నిపుణులు…

వాల్ క్లాడింగ్స్
వాల్ క్లాడింగ్స్.. అంటే గోడకు బయటి వైపు పెట్టే ఒక టెక్స్చర్. ఇది వాతావరణానికి, ఇంటి గోడలకు మధ్య అడ్డుగా ఉంటుంది. దానివల్ల గది లోపల ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఈ వాల్ క్లాడింగ్స్ ఆధునిక హాట్ కోటింగ్ టెక్నాలజీతో తయారు చేస్తారు. వీటి ఉపరితలం ఎక్కువ రోజులు మన్నడమే కాదు..గీతలు పడవు, గోడలను ఎండనుంచి ఎక్కువసేపు రక్షిస్తుంది.

రేడియంట్ కూలింగ్
ఏసీలకు బదులుగా రేడియంట్ కూలింగ్ సిస్టం కూడా మంచి మార్గం. కాకపోతే ఇది ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడే చేయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది. పైకప్పు, లేదా ఫ్లూరింగ్ లో ఇంటి నిర్మాణ దశలోనే అమర్చిన పైపుల గుండా మనం అనుకున్న ఉష్ణోగ్రతలో నీరు వెళ్తూ ఉంటుంది. చల్లని నీరు వెళ్లడం వల్ల గది చల్లగా మారుతుంది.

టెంపరేచర్ షీల్డ్ టైల్స్
వాల్ క్లాడింగ్స్ లాగే, టెంపరేచర్ షీల్డ్ టైల్స్ కూడా మంచి ప్రత్యామ్నాయం. వీటిని పైకప్పులు, బాల్కనీ, ఇంటి బయట గోడలకు వాడొచ్చు. ఇవి వేడిని గ్రహించవు. దీనివల్ల గదిలోపలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. వీటిని ప్రత్యేక మైన మెటీరియల్స్ తో తయారు చేస్తారు. దానివల్ల ఇంటి పైకప్పు లో వాడినపుడు ఎక్కువ వేడి గ్రహించకుండా చేస్తుంది. చల్లగా ఉంచుతుంది. ఇవి ఎక్కువ రోజులు మన్నుతాయి.

సమ్మర్లో వీటిని వినియోగించడం వల్ల ఫ్యాన్లు, కూలర్ల వాడకం తగ్గుతుంది. కరెంట్ బిల్ ఆదా అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరి…