తగ్గేదేలే..అప్పుడే రూటుమార్చేస్తోన్న శ్రీలీల!

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే…క్షణం కూడా ఆలోచించకుండా శ్రీలీల అని ఠక్కున సమాధానం చెబుతారు. ఇప్పటికే ఈ బ్యూటీకి టైమ్ చూసునే టైమ్ లేనంత బిజిగా ఉంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందనే న్యూస్ చక్కర్లు కొడుతోంది

శ్రీలీల .. ఇప్పటివరకు ఆమె తెలుగులో చేసింది రెండే సినిమాలు. కానీ సంపాదించుకున్న క్రేజ్ బోలెడంత. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడితో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీ హిట్ అందుకోపోయిన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజ ధమాకాతో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది. ఈ మూవీలో మాస్ డ్యాన్స్ తో దుమ్ములేపింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ ఎవరి సినిమాలో చూసినా ఈమె పేరే వినిపిస్తోంది.ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు డజను పెద్ద పెద్ద ప్రాజెక్టులున్నాయి.
వాటిలో సగం స్టార్ హీరోల ప్రాజెక్టులే. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, బాలకృష్ణ, నితిన్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణకి కూతురి వరసయ్యే పాత్రలో ఇలా ఊపిరి తీసుకోనంత బిజీగా ఉంది. తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిందని టాక్. సాధారణంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి అది తగ్గుతోంది అనిపించినప్పుడు లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగేస్తారు. కానీ శ్రీలీల మాత్రం త్వరలో లేడీ ఓరియెంటెండ్ సినిమాలో నటించబోతోందట. అదికూడా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో. అప్పుడే సింగీతం చెప్పిన స్టోరీలైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అయితే జరుగుతున్నట్లు సమాచారం. ఈ మూవీతో శ్రీలీల క్రేజ్ మరింత పెరుగుతుందంటున్నారు అభిమానులు.

‘ధమాకా’ ఫస్ట్ శ్రీలీల కాదు
వాస్తవానికి ధమాకా సినిమాలో మొదట శ్రీలీలను అనుకోలేదట. పూజాహెగ్డే ఫైనల్ అని ఫిక్సయ్యారట. కథ బావున్నప్పటికీ రవితేజ వరుస ఫ్లాప్ లతో ఉండటం వల్ల సినిమాకు నో చెప్పిందట పూజా. దీంతో ఈ అవకాశం శ్రీలీల దగ్గరకు వెళ్లింది. తనకంటే వయసులో రెండింతలు పెద్ద అయిన రవితేజతో కలిసి నటించడానికి ఓకే చెప్పి శ్రీలీల పెద్ద సాహసమే చేసింది. వాస్తవానికి సీనియర్ హీరోలతో నటిస్తే మళ్లీ యంగ్ హీరోలతో ఛాన్సులు వచ్చే అవకాశం తగ్గిపోతుందంటారు కానీ..శ్రీలీలకు మాత్రం రవితేజ బాగా కలిసొచ్చాడనే చెప్పాలి. ఆమె చేసిన సాహసం వర్కౌట్ అయి స్టార్ హీరోయిన్ స్టేటస్ కట్టబెట్టింది. మొత్తానికి శ్రీలీల జోరు ఇప్పట్లో ఆగేలా లేదు..