వేగం, సులభం, సౌకర్యవంతం – వందే భారతం

ప్రపంచం పరుగులు తీస్తోంది. భారత్ ఆ వేగాన్ని అందుకుని ప్రపంచాన్ని దాటుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ కాలం నాటి నత్తనడక పాలనకు తిలోదికాలిచ్చి, ఇప్పుడు మోదీ మార్క్ స్పీడ్ కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణ సాధనాల విషయంలో వేగాన్ని ప్రదర్శించినప్పుడే ఇతర అంశాల్లోనూ దూకుడు సాధ్యమని ప్రధాని మోదీ గుర్తించారు. ఆయన చొరవతోనే ఇప్పుడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకటొకటిగా పట్టాలెక్కుతున్నాయి.

కొత్త రైలు, కొత్త అనుభవం

ఇంతవరకు శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు మాత్రమే వేగంగా నడిచేవి. ఇప్పుడు వాటి స్థానంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. 16 బోగీలుండే వందే భారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ ఇప్పుడు 100 శాతం ఉందని రైల్వే అధికారులు తేల్చారు. మేకిన్ ఇండియాలో భాగంగా చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ బోగీలను తయారు చేశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల వందేభారత్ రైళ్లు.. ప్రస్తుతం 130 కిలోమీటర్లు టచ్ చేస్తున్నాయి. అయితే ట్రాకులను పూర్తి సిద్ధం చేసేంత వరకు సగటున గంటకు 90 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. వందే భారత్ రైళ్లపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు..

19 రైళ్లు.. భవిష్యత్తులో మరిన్ని..

2018లో వందే భారత్ రైళ్ల తయారీ మొదలై, 2019లో తొలి రైలు పట్టాలెక్కింది. ప్రస్తుతం 19 రైళ్లు నడుస్తున్నాయి. అందులో సికింద్రాబాద్ – విశాఖ, సికింద్రాబాద్ – తిరుపతి కూడా ఉన్నాయి. ఆ రూట్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కంటే ప్రయాణ సమయం 25 శాతం మేర తగ్గింది. త్వరలోనే మరో 35 రైళ్లను ప్రారంభించేందుకు భారతీయ రైల్వే ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో తెలుగు రాష్ట్రాలకు ఐదు రైళ్లున్నాయి.

వందే భారత్ 4.0

ప్రస్తుతం వందే భారత్ 2.0 నడుస్తోంది బయలుదేరిన 52 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. త్వరలో వందే భారత్ 3.0ను ప్రవేశ పెడతారు. అందులో స్లీపర్ క్లాస్ కూడా ఉంటుంది. 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. తర్వాత కొంతకాలానికి వందే భారత్ 4.0 రానుంది. ప్రమాదాలను సమర్థంగా నివారించే టెక్నాలజీ ఈ రైళ్లలో ఉంటుంది. 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 600 కిలోల బరువున్న పశువులు వచ్చి రైళ్లను ఢీకొన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం సంభవించదు.

అందమైన, ఆకర్షణీయమైన రైళ్లు

ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లను తొలుత ట్రైన్ 18 అని పిలిచేవారు. దాని డిజైన్, స్పీడ్ లాంటివి వందే భారత్ విజయానికి దోహదం చేశాయి. పెట్టెలో జనాన్ని కూర్చొబెట్టినట్లుగా ఉండే పాతకాలపు రైలు బోగీలకు బదులు, విశాలంగా, సౌకర్యవంతంగా ఉండే బోగీలు వందే భారత్ సొంతం. విమానం కంటే మెరుగైన డిజైన్ తో వందే భారత్ రైళ్లు రూపొందాయని ఆ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెబుతారు. రైళ్లలో వైఫైతో పాటు, 32 అంగుళాల స్కీన్ మీద డిస్ ప్లే చూసే వీలుంటుంది. ఏసీ కోచ్ వల్ల బయట వారికి ఇబ్బంది లేకుండా పర్యావరణ హితమైన రైళ్లు ఇవి…