గంగా పుష్కరాల్లో తెలుగు వారికి ప్రత్యేక ఏర్పాట్లు – 29 “కాశీ-తెలుగు సంగమం’లో ప్రధాని మోదీ ప్రసంగం ! –

ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి పుష్కరాలొస్తాయి. ఈ ఏడాది గంగానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకూ 12 రోజుల పాటూ గంగానదీతీర ప్రాంతాలన్నీ పుణ్యస్నానాలు చేసే భక్తులతో కళకళలాడిపోతుంటాయి. గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బదిరీనాథ్‌, కేదారనాథ్‌, వారణాసి, అలహాబాద్‌ క్షేత్రాల్లో ఘాట్లు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి గంగాపుష్కరాల్లో ప్రత్యేకత ఏంటంటే వారణాసి వెళ్లే భక్తులకు కాటేజీలు అందుబాటులో లేకపోతే టెంట్ సిటీలో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. గంగానది తీరంలో 100 హెక్టార్లలో ఏర్పాటు చేసిన ఈ టెంట్ సిటీని కొన్ని నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ప్రత్యేకగా కాశీ తెలుగు సంగమం నిర్వహణ

కాశీ విశ్వేశ్వరుడిని చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత భారీగా తరలివచ్చినా భక్తులకు వసతికి ఇబ్బంది లేకుండా టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించారు. దీంతో కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్ లో బస చేయవచ్చు. గంగా పుష్కరాల్లో భాగంగా ‘కాశీ-తెలుగు సంగమం’ పేరుతో ఏప్రిల్ 29న జరపనున్న ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మఖ్య అతిథిగా హాజరవనున్నారు.

తెలుగువారికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్న జీవీఎల్

‘శ్రీ కాశీ తెలుగు సమితి’కి గౌరవాధ్యక్షుడి హోదాలో పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ జీవీఎల్ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం కావడంతో ప్రధాని కార్యాలయం పర్యవేక్షణలో వారణాసి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 5 ప్రత్యేక బస్ రూట్లలో పెద్ద సంఖ్యలో బస్సులు నడుపనున్నారు. 24 గంటల పాటు హెల్ప్ లైన్, పోలీస్ గస్తీ సహా తెలుగువారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాశీని దర్శించుకునే యాత్రికుల్లో అత్యధిక భాగం తెలుగువారే , అందుకే తెలుగు యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

గంగా పుష్కరాల కోసం విశాఖపట్నంతో పాటు గుంటూరు, తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. తెలుగు యాత్రికులను ఉద్దేశించి ఆయన ఆరోజు ప్రసంగిస్తారని చెప్పారు. కాశీ పుణ్యక్షేత్రంతో తెలుగు ప్రజలకు ఉన్నంత అనుబంధం మరే రాష్ట్రం, భాష ప్రజలకు ఉండదని చెబుతూంటారు. తెలుగు ప్రజలకు తెలుగు భాషలో కాశీలోని సత్రాలు, ఉచిత అన్నదాన సదుపాయాలు, కర్మకాండలు నిర్వహించే తెలుగు పురోహితుల వివరాలు సహా సమగ్ర సమాచారంతో ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించారు.