వరుస ప్రాజెక్టులు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు నాని. గతంలో జెర్సీ సినిమాలో కొడుకు సెంటిమెంట్ పిండేసిన నాని ఈ సారి కూతురి సెంటిమెంట్ తో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.
రీసెంట్ గా వచ్చిన దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న నాని వరుస సినిమాలతో వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. వాళ్లంతా నూతన దర్శకులే కావడం విశేషం. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘దసరా’ నానిని ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసింది. ఎప్పుడు పక్కింటి కుర్రాడి పాత్రలో కనిపించే నాని దసరా లో ధరణి పాత్రలో బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పైగా తాను ఎలాంటి పాత్ర అయినా చేయగలననే క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ ఉత్సాహంలో ఉన్న నాని కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తే ఇలాగే ఉంటుందని ఫిక్సైనట్టున్నాడు. పైగా కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్న దర్శకుల దగ్గర మంచి కథలుంటాయనే ఆలోచనతో నాని ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే కొత్త దర్శకులతో రిస్క్ అవసరమా అనేవాళ్లు కూడా ఉన్నారు.
మరో కొత్త దర్శకుడితో నాని
ప్రస్తుతం నాని మరో నూతన దర్శకుడు శౌర్యువ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో నాని 30వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది. గతంలో జెర్సీ సినిమాలో కొడుకు సెంటిమెంట్ పండించిన నాని ఇప్పుడు రానున్న సినిమాలో కూతురి సెంటిమెంట్ చుట్టూ కథ నడుస్తుందని టాక్. పైగా ఎమోషనల్ సీన్స్ లో నాని ఇరగదీస్తాడన్నది ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో మరో హిట్ పక్కా అని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. శ్రుతిహాసన్ తో పాటూ మృణాల్ కూడా నటిస్తోన్న ఈ సినిమాను డిసెంబరు 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సౌత్ లోనూ మార్కెట్ పెంచుకునే ప్లాన్
నాని 30వ సినిమా తర్వాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. తెలుగుతో పాటుగా సౌత్ భాషల్లో తన మార్కెట్ పెంచుకోవాలనే ప్రయత్నంలో నాని కొత్త కాంబినేషన్స్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. దీనితో పాటుగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో కూడా నాని సినిమా ఉంటుందని టాక్. మొత్తానికి నయా దర్శకులతో దూసుకుపోతున్నాడు నాని.