రాజ్యసభకు సోనియా – కాంగ్రెస్ ఖేల్ ఖతం…?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు,ఆ పార్టీకి పెద్ద దిక్కు సోనియాగాంధీ ఇప్పుడు రూటు మార్చారు. లోక్ సభలో కూర్చోకూడదని నిర్ణయించుకుని, పార్లమెంట్లోనే కాస్త పక్కన ఉండే రాజ్యసభలో సెటిల్ కావాలనుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన సోనియాగాంధీ ఎన్నికల ఎకగ్రీవమే అవుతుంది. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించినా…. వారిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పార్టీకి ఏదో ముప్పు పొంచి ఉందన్న భయం వారిలో కలుగుతోంది.. భవిష్యత్తుపై బెంగ తప్పడం లేదు…

1999 నుంచి ఎన్నికల రాజకీయాల్లో…

సీతారాం కేసరి నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని లాక్కున్న తర్వాత 1999లో సోనియా తొలి సారి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటి నుంచి ఆమె ఓటమి అనేది ఎరుగరు.బీజేపీ దూసుకుపోతున్న రోజుల్లో కూడా పార్టీని క్రియాశీలంగా ఉంచడంలో ఆమె ప్రధాన భూమిక వహించారు. 2004 …2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి, యూపీఎ పటిష్ఠంగా ఉండటానికి సోనియా మంత్రాంగమే కారణమని చెబుతున్నారు. రాసుకొచ్చిన డైలాగులైనా సరే అవి పవర్ ఫుల్ గా ఉండేవని, సోనియా స్పీచ్ సులభంగా జనంలోకి వెళ్లిపోయేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిద్రాణంగా పడున్న కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు ఇచ్చిన నాయకురాలు కూడా సోనియానే అని చెప్పక తప్పదు.

రాయ్ బరేలీ విజయంపై అనుమానాలు ?

సోనియాగాంధీ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లోని రాయ్ బేరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన ఆమె తనయుడు రాహుల్ గాంధీ పరాజయం పాలయ్యారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయన్ను ఓడించారు. అప్పటి నుంచి బీజేపీ ఒక నినాదం అందుకుంది. నేడు అమేఠీ రేపు రాయ్ బరేలీ అన్నది ఐదేళ్లుగా బీజేపీ నేతలు చెబుతున్న మాట. దానితో రాహుల్ తరహాలో తాను కూడా ఓడిపోతే పార్టీ పరువు పూర్తిగా బజారున పడుతుందని సోనియా భయపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి పరిణామాలు పార్టీ మనుగడకు మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. పైగా రాహుల్ తరహాలో రెండు నియోజకవర్గాల పోటీ కూడా కరెక్టు కాదని సోనియా నిర్ణయానికి వచ్చారు…

ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న నేతలు…

కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మహారాష్ట్రలో ఆ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. మిలింద్ దేవరా నుంచి మాజీ సీఎం అశోక్ చవాన్ వరకు వరుసగా పక్క పార్టీలోకి క్యూ కట్టారు. అశోక్ చవాన్ కు బీజేపీ రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది. దానితో నేతలను కాపాడుకునేందుకు వారికి పదవులిచ్చి మరీ కాంగ్రెస్ అధిష్టానం బతిమాలుతోంది. తాజాగా అజేయ్ మాకెన్ కు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. అక్కడ నేతలు ఎవ్వరూ ఉండటం లేదని ఆయన అన్నారు….