టిడిపి మూడో జాబితా జిల్లాలో శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో మంటలు రేపింది. ఆయా నియోజకవర్గాల్లో ఊహించని విధంగా అభ్యర్థులను మార్చడం ఇందుకు కారణంగా ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్‌కు, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు కేటాయించడంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.
శ్రీకాకుళంను బీజేపీకి ఇస్తారని ప్రచారం – కానీ అభ్యర్థి ప్రకటన
రెండో జాబితా విడుదల సందర్భంగా శ్రీకాకుళం స్థానాన్ని బిజెపికి కేటాయించారంటూ ప్రచారం జరిగింది. దీంతో నియోజకవర్గ టిడిపి కేడర్ భగ్గుమంది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు నివాసం వద్ద ఆందోళనకు సైతం దిగారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చేస్తానంటూ మాటవివ్వడంతో అప్పటికి శాంతించారు. టిక్కెట్ కచ్చితంగా వస్తుందని ధీమాగా ఉన్న గుండ అభిమానులు ఈ నెల 22న వెలువడిన మూడో జాబితాతో అనుకోని షాక్ తగిలింది. ఆమె స్థానంలో గొండు శంకర్‌కు టిక్కెట్ దక్కడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. జాతీయ పార్టీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తీరుపై ఆగ్రహాం వెళ్లగక్కారు. ఫొటోలు, పార్టీ జెండాలు, పోస్టర్లు తగలబెడుతూ కోపంతో ఊగిపోయారు.
పాతపట్నంలోనూ అదే పరిస్థితి
పాతపట్నం టిక్కెట్‌ను మామిడి గోవిందరావుకు కేటాయించడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. కొత్తూరు మండలం మాతలలో సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటన ఉంటుందని కలమట వెంకటరమణ అనుచరులు చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే రెండుచోట్లా టిడిపికి ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టిడిపి డబ్బులకు టిక్కెట్లను అమ్ముకుందనే ఆరోపణలను మూటకట్టుకుంది. ఎన్నికల ఖర్చును పూర్తిగా ఎవరు పెట్టుకోగలిగితే వారికే అధిష్టానం టిక్కెట్లను కేటాయించిందనే చర్చ నడుస్తోంది. ఖర్చుకు వెనుకడుగు వేసిన వారిని పక్కన పెట్టిందని నాయకుల్లో చర్చల్లో వ్యక్తమవుతోంది.
అచ్చెన్నాయుడు రాజకీయాల వల్లే ఈ పరిస్థితినా ?
తమ నేతకు టిక్కెట్ రాకపోవడానికి కింజరాపు కుటుంబమే కారణమంటూ కేడర్ ప్రతీకారానికి సిద్ధమవుతోంది. కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని పైకి చెప్తున్నా… ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిర్ణయించినట్లు తెలిసింది. శ్రీకాకుళం నియోజకరవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ రాకపోవడానికి అచ్చెన్నాయుడే కారణమంటూ కేడర్ నిందిస్తోంది. గుండ కుటుంబాన్ని అణగదొక్కేందుకు ఒక పథకం ప్రకారం ఇలా చేశారని వారు చెప్తున్నారు. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో ఇద్దరు సీనియర్ మాజీ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్లుగా బరిలో దిగితే దాని ప్రభావం ఎంపీ రామ్మోహన్ నాయుడుపై పడనుంది. అచ్చెన్నాయుడును దెబ్బతీసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టం ఎంపీ రామ్మోహన్ నాయుడుకి తగలనుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యే కేడర్, అభిమానులు, సానుభూతిపరులు ఎంపీ కాదని వేరే అభ్యర్థికి ఓటేస్తే టిడిపి ఎంపీ సీటును కోల్పోయే ప్రమాదముందనే ఆందోళన కేడర్‌లో కనిపిస్తోంది.