కాంగ్రెస్ పార్టీ తిరోగమన రాజకీయాలకు పెట్టింది పేరు. జనంలో విభజనను, విభేదాలను సృష్టించి లబ్ధి పొందేందుకు ప్రయత్నించే పార్టీ అది. దేశ స్వాతంత్ర్యం తర్వాత మొదటి నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ సమర్థంగా ఆ పని చేయగలిగింది. తర్వాత హస్తం పార్టీ దురాలోచనలను జనం అర్థం చేసుకున్నారు. దానితో వారి ఆటలు సాగలేదు. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ సుస్థిరమైన, సమర్థమైన పాలన అందించడంతో కాంగ్రెస్ కు పుట్టగతులు లేకుండా పోయాయి. దానితో కులరక్కసి కోరల్లోకి దేశాన్ని మళ్లీ లాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది..
సిద్దా వ్యాఖ్యల దుమారం..
కర్ణాటక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ బీజేపీ పట్ల జనంలో విశ్వాసం పెరిగినట్లు తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. దానితో విపక్ష హస్తం పార్టీ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. దానితో విచక్షణా రహితమైన ప్రకటనలు చేస్తూ జనాన్ని రెచ్చగొట్టే పనిలో ఉంది.
మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేరుకు మాత్రమే పెద్ద మనిషి. నోరు తెరిస్తే ఆయన అసలు రంగు బయటపడుతూ ఉంటుంది. పదవి కోసం ఏమైనా మాట్లాడే, ఎలాంటి రాజకీయమైన చేసే సిద్దరామయ్య మరో సారి తన నిజ్వరూపాన్ని బయటపెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి బొమ్మాయ్ మీద అభ్యంతరకర కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లింగాయత్ ముఖ్యమంత్రి ఉన్నారు.. అవినీతికి ఆయనే బీజం వేశారు… అని సిద్దరామయ్య చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ తీరుకు దర్పణం పట్టింది. లింగాయత్ ముఖ్యమంత్రి ఉండాలన్న వాదనపై స్పందించాలని కోరితే కులం పేరుతో అవమానకరంగా మాట్లాడారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి సిద్దరామయ్య అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏ కులంవారైనా సమర్థులైతే, ప్రజాసేవలో తరిస్తే ముఖ్యమంత్రి కావడంలో తప్పులేదని ఆయనకు తెలియనిది కాదు. కులం వేరు, అవినీతి వేరు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా ఆయన పనిగట్టుకుని ఓ డైలాగ్ వదిలారు. సిద్దరామయ్య అహకారంతో లింగాయత్ లను అవమానించిన తీరు ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ప్రచారాస్త్రం అవుతోంది.
సీఎం స్ట్రాంగ్ కౌంటర్
బీజేపీ ముఖ్యమంత్రి బొమ్మాయ్, కాంగ్రెస్ నేతకు గట్టిగా సమాధానమిచ్చారు. జయ వాహిని పేరుతో బెంగళూరులో ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం.. సిద్దరామయ్య పాలనాకాలం నాటి రూ. 8 వేల కోట్ల స్కాములను ప్రస్తావించారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సిద్దరామయ్యను పరోక్షంగానూ, ప్రత్యేక్షంగానూ విమర్శిస్తూ బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని అన్నారు. బసవన్న సిద్ధాంతాలను బీజేపీ అమలు చేస్తుందని చెబుతూ, అణగారిన వర్గాలను పైకి తీసుకురావడమే తమ ధ్యేయమన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అవకాశమిచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అని బొమ్మాయ్ గుర్తు చేశారు..
ఓట్ బేస్ పెంచుకున్న బీజేపీ
నిజానికి సంక్షేమ మార్గంలో జనాన్ని ఆకట్టుకున్న బీజేపీ,కర్ణాటకలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకుందనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హాయాంలో బీజేపీ పటిష్టమైంది. అన్ని వైపుల నుంచి చేరికలకు అవకాశం ఇస్తూ పార్టీని ముందుకు నడిపించారు. సంకుచిత కుల రాజకీయాలను పక్కన పెట్టి యడ్యూరప్ప హయాంలో పనిచేసినందునే దక్షిణాదిన తొలి బీజేపీ పాలిత రాష్ట్రంగా కొనసాగుతోంది. ఖచితంగా చెప్పాలంటే వీరశైవ -లింగాయత్స్, వాల్మీకీలు, ఎస్సీ, ఎస్టీ.. అందరూ బీజేపీకి మద్దతిస్తున్నారు. అందుకే సిద్దరామయ్య లాంటి నేతల పాచికలు పారడం లేదని కమలం పార్టీ ధీమాగా చెబుతోంది.