ఉద్యోగం చేసేవారికి విరమణ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నియమం కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి 58 నుంచి 65 సంవత్సరాల వయసు వరకు ఏదోక రోజున ఉద్యోగ విమరణ చేస్తారు. రాజకీయులకు మాత్రం ఎందుకో ఇంతవరకు ఆ నియమం పెట్టనే లేదు. చాలా సార్లు అలాంటి చర్చకు తెరలేచినా, అంతే వేగంతో చప్పున చల్లారిపోయింది. కామరాజ్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఇకచాలు అన్న మాటలు వినిపించడం, తర్వాత తెరమరుగు కావడం కామనైపోయింది.
శరద్ పవార్ విరమణ చర్చ ..
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో పార్టీ ఫిరాయింపుల చట్టం, నైతిక విలువల సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చిన మాట వాస్తవం. అంతకు మించి శరద్ పవార్ ఇంకా రాజకీయాల్లో ఎందుకున్నారన్న అన్న ప్రస్తావన ఇలా వచ్చి అలా చల్లారిపోయింది. ఎన్సీపీని చీల్చి, బీజేపీ కూటమి వైపుకు వెళ్లి, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అజిత్ పవార్ లేవనెత్తిన రిటైర్మెంట్ ప్రశ్న తెరమరుగైనప్పటికీ దాన్ని అంత తేలిగ్గా వదిలెయ్యలేని పరిస్థితులున్నాయ్. 83 ఏళ్ల సీనియర్ పవార్ ఆరోగ్యం బాగోలేకపోయినా ఆయన మాట ఎవరికీ అర్థం కాకపోయినా రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తెల్చిచెప్పారు. పైగా ఆ మాట అడిగిన వారిపై అంతెత్తున ఎగిరిపడ్డారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు మీరే కొనసాగుతారన్న ప్రశ్న అజిత్ పవార్ లేవనెత్తితే… అంతా నా ఇష్టం 83 ఐనా, 93 వచ్చినా రాజకీయాల్లోనే ఉంటానని శరద్ పవార్ తేల్చేశారు.
ప్రజక్షేత్రంలో చర్చ అనివార్యం..
బాగా పండిపోయిన రాజకీయ నాయకులు అస్త్ర సన్యాసం చేయాల్సిన తరుణం దగ్గర పడుతోందన్నది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న వాదన. చట్ట ప్రకారం రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ వయసు లేదన్నది వాస్తవమైనప్పటికీ నడవ గలిగినా, నడవలేకపోయినా ఇంకెన్నాళ్లు అలా కొనసాగుతామని వాళ్లకు వాళ్లే ప్రశ్నించుకోవాలి. అకాలీనేత ప్రకాశ్ సింగ్ బాదల్ తన 96 ఏట చనిపోయే వరకు రాజకీయాల్లో కొనసాగారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి , సీపీఎం నేత అచ్యుతానందన్ కూడా అంతే. కరుణానిధి, ములాయం సింగ్ చచ్చే దాకా రాజకీయాల్లో ఏదోక పదవిని నిర్వహిస్తూ చక్రం తిప్పుతూనే ఉన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ తన 90వ ఏట ఇంకా కర్ణాటస రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. బిహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ మరో అడుగు ముందుకేసి రాజకీయాల్లో రిటైర్మెంట్ గురించి మాట్లాడే వారు తన దగ్గరకు రావద్దని ప్రకటించేశారు. 75 ఏళ్లు వచ్చినా రిటైర్మెంట్ కు ఇంకా దగ్గర పడలేదన్నది ఆయన సమాధానంగా భావించాల్సి ఉంటుంది. ఫరూక్ అబ్దుల్లాకు 85, మల్లికార్జున్ ఖర్గేకు 80, అమరీందర్ సింగ్ కు 81 సంవత్సరాలుంటాయి.
రిటైర్మెంట్ ఉండాల్సిందేనంటున్న జనం
శరద్ పవార్ తనయ సుప్రియా సూలే ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. 82 ఏళ్ల అమితాబ్ బచ్చన్, 85 ఏళ్ల రతన్ టాటా రిటైర్ కానప్పుడు మానన్నకు తొందరేంటన్నది ఆమె ప్రశ్న. నిజానికి పొలిటీషియన్స్ కు రిటైర్మెంట్ వయసు ఉండాలని ఇండియా నుంచి అమెరికా వరకు జనం చర్చించుకుంటూనే ఉన్నారు. అమెరికాలో 50 శాతం మంది పొలిటికల్ రిటైర్మెంట్ కు మద్దతిస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఎలాన్ మస్క్, జిమ్మి కార్టర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. 70 ఏళ్లు దాటిన జో బైడెన్ ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికి అమెరికా జనం కాస్త వెనుకాడినట్లు కూడా సర్వేలు చెప్పాయి. వయసు పెరిగిన కొద్ది ఆలోచనా శక్తి, స్పందించే గుణం తగ్గుతుందని , సమస్యల పరిష్కారంలో ఆసక్తి లోపిస్తుందని న్యూరో బయాలజిస్టుల వాదన. అందుకే ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసుపై చర్చ కూడా జరిగే వీలుంది.
మోదీ ఏం చేశారు.. ఏం చేయబోతున్నారు..
ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ వయసుపై దృష్టి పెట్టారు. 75 ఏళ్లు దాటిన వారు విశ్రాంతి తీసుకుని పార్టీకి మార్గనిర్దేశనం చేస్తే మంచిదని సూచించి ఆ దిశగా అడుగులు వేశారు. అందుకే కర్ణాటకలో యడ్యూరప్ప, గుజరాత్ రాష్ట్రంలో ఆనందీ బెన్ పటేల్ ను సీఎం పదవుల నుంచి తొలగించారనుకోవాలి. ఇక 2026 నాటికి మోదీ, స్వీట్ 75 దాటతారు. తాను నిర్దేశించిన నియమాన్ని ఆయన పాటిస్తారా. ప్రత్యేక పరిస్తితుల్లో పదవిలో కొనసాగుతారా అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్లో ఏజ్ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశాలున్నాయి. కొంతమంది సిట్టింగులకు విశ్రాంతినివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి చెప్పగలిగిందీ అంతే..