బీజేపీ, జనసేన విడిపోవాల్సిందేనా ? ఏపీలో జరుగుతున్నది రాజకీయం ఇదేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇప్పుడే కాదు గతంలోనూ రెండు సార్లుభేటీ అయ్యారు. ఇప్పటికి మూడు సార్లు భేటీ అయ్యారు. ఇలా భేటీ అయిన ప్రతీ సారి మీడియాలో.. సోషల్ మీడియాలో ఏపీ బీజేపీని లాగడం కొంత మందికి అలవాటయిపోయింది. ఏపీ బీజేపీపై వ్యతిరేకతో జనసేన పార్టీని ఆ పార్టీ నుంచి దూరం చేయాలన్న ఏకైక ఏజెండాతో ఇలా చేస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఆ పార్టీ స్వతంత్రతను బీజేపీ గుర్తిస్తుంది. అంతే కానీ.. ఆ పార్టీ మీద ఆధారపడి లేదన్న విషయం గుర్తుంచుకోవాలని బీజేపీ నేతలు అంటున్నారు.

బీజేపీతో పొత్తులో లేమని పవన్ చెప్పలేదుగా !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని నిర్మోహమటంగా చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆ మాటకు వస్తే పవన్ రాజకీయ కార్యక్రమాల్లోనే పెద్దగా లేరు. ఆయన కమిట్ మెంట్స్ ఆయనకు ఉన్నాయి.కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముఖ్య నేతలతో రెండు రోజులు సంప్రదింపులు జరిపి వచ్చారు కూడా. అయినప్పటికీ పవన్ కల్యాణ్ బీజేపీతో ఉన్న విషయాన్ని మర్చిపోయి..ఆయనను దూరం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

వైసీపీ విముక్త ఏపీనే జనసేన, బీజేపీ లక్ష్యం కూడా !

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజ్యాంగ పరంగా కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించే విషయంలో నిబంధనలు ఉంటాయి.ఆ నిబంధనల ప్రకారం ఏపీ ప్రభుత్వానికీ సహకరిస్తోంది. అంత మాత్రానికే.. బీజేపీ వైసీపీ దగ్గర అనే ప్రచారం చేశారు. కానీ ఏపీ బీజేపీ ప్రభుత్వంపై ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. తాజాగా చార్జిషిట్ల ఉద్యమం మచేయబోతున్నారు. గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టమని కూడా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని వైసీపీ నాశనం చేసిందనే బీజేపీ అభిప్రాయమని.. వైసీపీని ఓడించడమే కాదు జనసేన – బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని వారంటున్నారు.

బీజేపీ ఒకరిపై ఆధారపడే పార్టీ కాదని గుర్తు చేస్తున్న నేతలు !

రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలు ఉంటేనే పొత్తులు ఉంటాయి. ఏపీ బీజేపీ, జనసేన వల్ల రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుందనే పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని పవన్ దగ్గరకు బీజేపీ హైకమాండ్ ఎలాంటి ప్రదిపాదనలు పంపలేదు. ఆయనే ఢిల్లీ వెళ్లి ప్రతిపాదన పెట్టి మరీ పొత్తులు పెట్టుకున్నారు. ఆయన నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్ స్వాగతించింది. అప్పట్నుంచి కలిసి పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జనసేన యాక్టివ్ గా లేకపోయినా బీజేపీ పోరాడుతూనే ఉంది. ఇప్పుడు పొత్తుల విషయంలో అనవసర ప్రచారాలతో రెండు పార్టీల బంధం విడదీయలేరని అంటున్నారు.