అవసరం లేకపోయినా ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటే దారుమమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఏపీ అధికార పార్టీకీ అదే పరిస్థితి. టీడీపీ నుంచి గెలిచిన వారిలో నలుగురు ఎమ్మెల్యేల్ని తీసుకున్న ఆ పార్టీ నేతలు.. ఇప్పుడు కీలక నేతలు రచ్చ చేస్తూండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ఇందులో రెండు నియోజకవర్గాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
టీడీపీలో చేరేందుకు సిద్ధమైన గన్నవరం వెంకట్రావు
గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్రలో టీడీపీలో చేరే అవకాశం ఉందని యార్లగడ్డ అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్య నేతలతో యార్లగడ్డ చర్చించారు. ఆదివారం నాడు జరిగే భేటీలో పార్టీ మార్పుపై యార్లగడ్డ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 19న యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. ఈ యాత్రలో భాగంగా.. లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరేందుకు యార్లగడ్డ సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
గన్నవరంలోనే పోటీ చేస్తానంటున్న యార్లగడ్డ
గన్నవరం రాజకీయాల్లోనే ఉంటా. ఇక్కడి నుంచే పోటీ చేస్తా. ఏ పార్టీ అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఆయన చెబుతూ వస్తున్నారు. అమెరికాను వదిలేసి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చానని. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశానన్నారు. ఓడిపోతే అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారు. అయినా నేను అమెరికా వెళ్లలేదు. అమెరికాలో వ్యాపారాలు ఉన్నా ఈ ఐదేళ్లలో కేవలం మూడుసార్లే వెళ్లానన్నారు. 20౨4లో గన్నవరం నుంచి పోటీ చేయడం మాత్రం ఖాయమన్నారు. అప్పట్నుంచీ యార్లగడ్డ టీడీపీలో చేరతారని తేలిపోయింది. ప్రస్తుతం టీడీపీకి గన్నవరంలో సరైన అభ్యర్థి లేరు.
చీరాలలోనూ అదే పరిస్థితి
చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటికే వైసీపీ నేతగా ఉన్న ఆమంచి దాన్ని ఎలా ఒప్పుకుంటారు ?. అందుకే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బలవంతంగా ఆయనను పర్చూరు పంపారు జగన్. కానీ ఆయన మనసు చీరాలలోనే. అందుకే వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికుల జరుగుతూంటే తమ వారిని నిలబెడుతున్నారు. అక్కడ కూడా పరిస్థితి చేయిదాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.