అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనూహ్య ఫలితం వచ్చింది. టైట్ ఫైట్ ఉంటుందనుకున్న రాష్ట్రంలో బీజేపీ ఘనవిజయం సాధించి ఎన్నికల సర్వేయర్లను సైతం ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎంపికలోనూ బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచిందనే అనుకోవాలి. హేమాహేమీలు వారం రోజులకు పైగా ఎదురుచూడగా అనూహ్యంగా ఒక ఓబీసీ నాయకుడిని సీఎం పీఠంపై కూర్చోబెడుతోంది.
టీ కొట్టు నడిపిన కుటుంబం…
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక కూడా ఆశ్చర్యకరంగానే సాగింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తాజా మాజీ శివరాజ్ సింగ్ చౌహాన్ కు మళ్లీ అవకాశం ఇవ్వబోవడం లేదని అధిష్టానం ఎప్పుడో సంకేతాలిచ్చింది. దానితో ఆయన కూడా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకు సిద్ధమయ్యారు. ఇక అధిష్టానం నిర్వహించిన ముఖ్యమంత్రి ఎంపిక మీటింగులో మోహన్ యాదవ్ మూడో వరుసలో కూర్చుని ఉన్నారు. తనకు అవకాశం వస్తుందని ఆయనకు ఎలాంటి సందేశమూ లేదు. అకస్మాత్తుగా ఆయన పేరు ప్రకటించడంతో మోహన్ యాదవ్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు సార్లు ఉజ్జయినీ దక్షిణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మోహన్ యాదవ్, తండ్రి టీ షాపు నడిపేవారు. ప్రధాని మోదీ చిన్న వయస్సులో టీ అమ్మి పొట్టపోసుకున్నట్లుగానే, మోహన్ యాదవ్ కుటుంబం కూడా టీ అమ్మిన డబ్బుతోనే కాలం వెళ్లదీసేది. 1984 నుంచి యాదవ్, బీజేపీలో క్రియాశీలంగా ఉంటున్నారు. పార్టీలోని ప్రతీ ఒక్క కార్యకర్తతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండటంతో అందరి బంధువని పేరు వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖా మంత్రిగా సేవలందించిన తనకు మళ్లీ అలాంటి పదవే వస్తుందని మోహన్ యాదవ్ ఎదురుచూస్తున్న తరుణంలో ఏకంగా ముఖ్యమంత్రి పదవే దక్కింది.
బీజేపీ అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్..
సీఎం పదవి కోసం చాలా మంది నేతలు కాచుకుకూర్చున్న మాట వాస్తవం. టికెట్ల బట్వాడాలో పార్టీ తీరును చూసి ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. నరేంద్ర తోమార్, వీడీ శర్మ, కైలాస్ విజయవర్గీయలో ఒకరికి సీఎం పదవి ఖాయమనున్నారు. మీటింగులోనూ వారంతా ముందు కూర్చుని ఉత్కంఠగా ఎదురుచూశారు. కాకపోతే 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓబీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో మోహన్ యాదవ్ సీఎం అవుతున్నారు.వీలు దొరికినప్పుడల్లా ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ను దర్శించుకునే మోహన్ యాదవ్ తన పేరును ప్రకటించినప్పుడు తన చెవులను తానే నమ్మలేకపోయారు. ఆయన కంటి వెంట ఆనంద భాష్పాలు రాలాయని పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలు చెబుతున్నారు. యాదవ్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ప్రకటించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన జగదీశ్ దేవ్డా, బ్రాహ్మణ కులానికి చెందిన రాజేంద్ర సుక్లా ఇకపై డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తారు. దానితో దాదాపు అన్ని వర్గాలను బీజేపీ అధిష్టానం సంతృప్తి పరిచినట్లయ్యింది. పైగా 52 శాతం జనాభా ఉన్న ఓబీసీలను ప్రసన్నం చేసుకునేందుకు మోహన్ యాదవ్ కు సీఎం పదవి ఇచ్చారు..
శివరాజ్ చౌహాన్ కు త్వరలో సముచిత స్థానం..
ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను పూర్తిగా పక్కన పెట్టినట్లు కూడా భావించాల్సిన పనిలేదు. ఆయన ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన్ను బరిలోకి దించి కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు మధ్యప్రదేశ్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన సేవలను వినియోగించే వీలుంది…