షెట్టార్ పునరాగమనం..బీజేపీకి ప్రయోజనం

కర్ణాటక బీజేపీలో ఘర్ వాపసీ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్ తిరిగి బీజేపీలో చేరారు. ఇదీ ఆయనకు, పార్టీకి అన్ని విధాలా ప్రయోజనకరమైన పరిణామంగా పరిగణిస్తున్నారు. కాంగ్రెస్ లోనే ఉంటానని అంటూనే ఆయన మళ్లీ బీజేపీలోకి వచ్చారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఇబ్బందికర పరిస్థితులకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో లభించని గౌరవం…

షెట్టార్ లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. కర్ణాటకలో ఆ కులానికి 18 శాతం ఓటు బ్యాంకు ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో వారిదే కీలక భూమిక. నాలుగు దశాబ్దాల పాటు బీజేపీలో ఉండి కీలక పదవులు వహించిన జగదీష్ షెట్టార్ కు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ సారి పోటీ చేయొద్దులే అని ఆపేసిన బహుకొద్ది మంది నేతల్లో షెట్టార్ కూడా ఉన్నారు. దానితో ఆయన అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడా కాలం కలిసి రాలేదు. హుబ్బాలీ – ధార్వాడ్ నియోజకవర్గానికి ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించిన షెట్టార్.. కాంగ్రెస్ లో చేరి ఓడిపోయారు. అయితే షెట్టార్ చెప్పినట్లగా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. తనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల 25 నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతింటుందని షెట్టార్ చెప్పడం నిజమైంది. దానితో ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. షెట్టార్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తర్వాత పక్కన పెట్టేసిందన్న అనుమానాలు కలిగాయి. పార్టీ తనను ఔట్ సైడర్ గా చూస్తోందని షెట్టార్ భావించారు….

చక్రం తిప్పిన విజయేంద్ర

లోక్ సభ ఎన్నికల వేళ షెట్టార్ చేరిక బీజేపీకి కొత్త ఊపునిచ్చినట్లయ్యింది. మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర ..బీజేపీ కర్ణాటక శాఖ పగ్గాలు చేపట్టిన తర్వాత స్పీడ్ పెంచారు. పార్టీని వదిలి వెళ్లిన వారితో మాట్లాడుతూ వారిని వెనక్కి రప్పించే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే జగదీష్ షెట్టార్ తో జరిపిన దౌత్యం విజయవంతమైంది. పైగా విజయేంద్ర కంటే యడ్యూరప్ప ఆహ్వానం మేరకే షెట్టార్ మళ్లీ వచ్చారని కర్ణాటకలో టాక్ నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో ఇంకా యడ్యూరప్ప హవా కొనసాగుతుందనేందుకు ఇదీ నిదర్శనంగా నిలుస్తోంది. తాజా పరిణామాలు ఉత్తర కర్ణాటకలో బీజేపీ ఇమేజ్ పెంచే చర్యగా కూడా పరిగణించాల్సి ఉంటుంది.

కార్యకర్తల మనోభావాలను గౌరవించా – షెట్టార్

బీజేపీలోకి తిరిగిరావడం వెనుక షెట్టార్ తన వాదనను వినిపించారు. తన అనుచరులు, కార్యకర్తల్లో మెజార్టీ వర్గం అభిప్రాయాలను పరిగణిస్తూ మళ్లీ కమలం పార్టీలో చేరానని ఆయన చెప్పుకున్నారు. అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే వచ్చానన్నారు. మోదీని మూడో సారి ప్రధానమంత్రిని చేసేందుకు కర్ణాటకలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. అయితే కర్ణాటక రాజకీయాల్లో మరో మాట వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని తేలిపోయింది. కర్ణాటకలో ఆ పార్టీకి కనిష్టంగా 25 స్థానాలు వస్తాయని అర్థమైంది.దానితో బీజేపీలో చేరి లోక్ సభ సీటు తీసుకోగలిగితే కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వీలుంటుందని షెట్టార్ అంచనా వేసుకున్నారు. అందుకే పార్టీ మారారని చెబుతున్నారు..