పాలేరులో షర్మిల “పథకాలు” పారిస్తున్నారు !

పాలేరును పులివెందులగా మార్చాలని పట్టుదల ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అక్కడ ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించారు. సొంత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్కడ పరిపాలించడం ఏమీ లేదు. పథకాలు మాత్రం అమలు చేస్తున్నారు. అంటే ప్రజలకు సొంత డబ్బుతో ఉచిత పథకాలు ఇస్తున్నారన్నమాట . గెలవడానికి ఓట్లు వేసే టప్పుడు డబ్బులు పంచిదే చాలదు… నమ్మకంకలిగించడానికి ముందు నుంచీ పంచకుంటూ రావాలని షర్మిల త్వరగానే గుర్తించారు. ప్రస్తుతం పాలేరులో ఆమె కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు.

సొంత డబ్బుతో పాలేరులో షర్మిల పథకాలు

సొంత డబ్బుతో పాలేరులో ఫ్రీ స్కీములను అమలు చేయాలని నిర్ణయించారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను ఇచ్చి.. ఏ ఆస్పత్రిలో అయినా వారికి ఉచిత వైద్యం చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్​లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను రెడీ చేశారు. అలాగే పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య చెప్పించాలనుకుంటున్నారు. స్కూళ్లతో ఒప్పందాలు చేసుకుని ఆ ఫీజు తామే చెల్లించాలనుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్​ఎవరైనా ఆర్థిక సాయం కోరితే అందించేందుకు ప్రత్యేక ఆఫీస్ పెడుతున్నారు. నిజంగా పేదరికం కారణంగానే ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నట్టయితే వారికి తక్షణ సాయం అందిస్తామని ప్రచతారం చేస్తున్నారు.

పాలేరులో ఎవరైనా చనిపోతే కుటుంబానికి రూ. పాతిక వేల సాయం !

పాలేరులో ఎవరు చనిపోయిన కుటుంబాలకు రూ.25 వేలు ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సాయాన్ని పంచడం ప్రారంభించారు. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందిస్తామని.. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని ప్రచారం చేయబోతున్నారు.ప్రజలు ఎంత వరకూ నమ్ముతారో కానీ… ప్రస్తుతం ఇస్తున్న నగదును మాత్రం ఎవరూ వద్దనడం లేదు.

ప్రజలకు డబ్బులిచ్చి మభ్యపెట్టగలరా ?

రాజకీయం అంటే వారికి కొంత ఇచ్చి వారి ఓట్లు పొంది.. తర్వాత వారిని దోచుకోవడం అన్నట్లుగానే ఉంది. ఇదే వ్యూహాలను అన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయి. దీన్ని ఇప్పుడు నయా పార్టీల నేతలు.. కొత్త తరహాలో చేస్తున్నారు. మొదట పెట్టుబడిగా ప్రజలకుపథకా రూపంలో పంచి.. తర్వాత అధికారంలోకి వచ్చాక వనరుల్ని దోచుకోవడానికి అధికారం రూపంలో లైసెన్స్ పొందుతున్నారు. ఖమ్మంలో బయ్యారం గనుల విషయంలో షర్మిల కుటుంబంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఖమ్మంపైనే గురి పెట్టి డబ్బులు పంచుతూండటం ఆసక్తికరంగా మారింది .