గులాబీ దళపతి కేసీఆర్ పొరుగున ఉన్న మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన రాజకీయ సంస్థగా చూడాలంటే మహారాష్ట్రలో కొన్ని సీట్లు గెలిచి కనీసం ఆరు శాతం ఓట్లు పొందాలని కేసీఆర్ డిసైడయ్యారు. ఆ దిశగానే పావులు కదుపుతూ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు..
భారీ కాన్వాయ్ రావడంపై ఎన్సీపీ నేత అభ్యంతరం
తీర్థయాత్ర, రాజకీయ యాత్ర కలిపి మహారాష్ట్ర చుట్టి వచ్చిన కేసీఆర్ పెద్ద పబ్లిసిటీ మేనేజ్ మెంట్ చేసుకున్నారు. కేసీఆర్ వెంట 400 వాహనాలు వెళ్లినట్లు చెబుతున్నారు. కిలోమీటర్ల కొద్ది కాన్వాయ్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎంట్రీ శరద్ పవార్ తొలి సారి అధికారికంగా స్పందించారు. కేసీఆర్ బల ప్రదర్శనకు దిగారని అంత సీన్ అవసరం లేదని పవార్ వ్యాఖ్యానించారు. ఇలా గుంపులను వేసుకుని వచ్చే బదులు ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రయత్నిస్తే బావుంటుందని పవార్ హితవు పలికారు. కేసీఆర్ తీరు ఆందోళన కలిగిస్తోందని కూడా పవన్ ఫైరయ్యారు.
ఇప్పటి దాకా మంచి మిత్రులు
శరద్ పవార్, కేసీఆర్ ఇప్పటి దాకా మంచి మిత్రులు. తెలంగాణ ఉద్యమానికి తొట్టతొలిగా బహిరంగ మద్దతు ప్రకటించిన వారిలో శరద్ పవార్ ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ ముంబై వెళ్లినప్పుడు కూడా శరద్ పవార్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ కూతురు కవిత, శరద్ పవార్ తనయ సుప్రియా సూలే మంచి మిత్రులు కూడా. ఇప్పుడు మాత్రం కేసీఆర్ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ నేతలందరినీ బీఆర్ఎస్ లో చేర్చుకుని తమ పార్టీని దెబ్బకొడుతున్నారని పవార్ ఆగ్రహం చెందుతున్నారు.
కేసీఆర్ ను తూర్పారపట్టిన సామ్నా సంపాదకీయం
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్ పై శివసేన పత్రిక తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన వైఖరిని వ్యతిరేకిస్తూ సంపాదకీయం రాసింది. ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ బాగా పనిచేస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ మదిలో జాతీయ పార్టీ అనే పురుగు దూరిందని ఎద్దేవా చేసింది. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర చాలా గొప్పదని ప్రశంసిస్తూనే రెండు సార్లు సీఎం అయ్యాక.. ఇప్పుడాయన కాలి కింద నేల కదిలిపోతోందని సామ్నా విశ్లేషించింది. కేసీఆర్ పార్టీ 2024లో గెలుస్తుందని ఎవరూ హామీ ఇవ్వలేకపోతున్నారని సామ్నా వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కూతురు కవిత, ఇప్పుడు లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణను ఎదుర్కొంటున్నారని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బీజేపీకి ప్రయోజనం కలిగించేవిగా ఉన్నాయని సామ్నా ఎడిటోరియల్ అభిప్రాయపడింది. ఓట్లు చీల్చడం ఒవైసీ వల్ల కావడం లేదని గుర్తించిన బీజేపీ ఇప్పుడు ఆయన స్థానంలో కేసీఆర్ ను దించిందని అనుమానించింది. కేసీఆర్ సామర్థ్యాన్ని శంకించాల్సిన అవసరం లేదని, కాకపోతే ఇప్పుడు వేరెవ్వరో ఆయన్ను ఆడిస్తున్నారని సామ్నా ఆరోపించింది. మరో పక్క బీఆర్ఎస్ పై బాగా కోపంగా ఉన్న ఎన్సీపీ తెలంగాణలో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటోంది. అందులో గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.