భరత ఖండంలో ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలూ పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత,స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి శివుడే స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
జగద్గురు జననం
జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నం శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు.
రెండో సంవత్సరంలోనే వేదాధ్యయనం
ఆది శంకరాచార్యులు తన రెండో సంవత్సరంలోనే వేదాధ్యయనం ప్రారంభించారు. శంకరులకి మూడో సంవత్సరం వచ్చేసరికి తండ్రి చనిపోయారు. ఐదో సంవత్సరంలో కామ్యోపనయనం చేసారు. ఏడవసంవత్సరంలో వేదాధ్యాయనం చేసేసి.. తల్లి అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదా చార్యులవారి వద్ద శాస్త్రాధ్యాయనం చేశారు. ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది.
వృద్ధురాలి ఇంట బంగారు వర్షం
సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత బిక్షకు వెళ్లిన శంకరులు ఓ వృద్ధురాలి ఇంటిముందు నిల్చుని భవతీ భిక్షాందేహి అన్నారు. ఆ పేద వృద్ధురాలు తనవద్ద ఏమీ లేదంటూ ఓ ఉసిరికాయ దానం చేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని ఆ ఇంటి ముందు నిల్చుని స్తుతించారు. అదే కనకధార స్తోత్రం…దానికి ఆ తల్లి సంతోషించి ఆ వృద్ధురాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.
తల్లి కోసం నది దారి మళ్లించిన శంకరులు
శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. అంటే నదీ ప్రవాహ దారి మళ్లించారు. అది చూసి గ్రామ ప్రజలు ఆయన తపోఫలం చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సన్యాసాశ్రమం స్వీకరిస్తానని తల్లిని అడిగితే..తాను ఒంటరిని అవుతానని అంగీకరించలేదు..ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని తల్లిని కోరడంతో ఆమె సరే అనగానే మొసలి వదిలేసింది. అంటే..ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ, ఆ బంధాలనుంచి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారన్నమాట. అయితే సన్యాసం స్వీకరించేందుకు వెళుతున్నప్పుడే ఎక్కడున్నా అంత్యక్రియలకు వస్తానని తల్లికి మాటిచ్చారు శంకరులు. చెప్పినట్టే..సన్యాశాశ్రమ ధర్మాన్ని పక్కనపెట్టి తల్లికి అంత్యక్రియలు చేశారు.
ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలు రచించిన శంకరులు
తల్లి దగ్గర్నుంచి బయలుదేరి వెళ్లిన తర్వాత గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని భావించారు. చాలా పరీక్షలు నిర్వహించిన గోవింద భగవత్పాదులు శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు.ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి కాశీ బయలుదేరారు. ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించేందుకు పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమంటారు. ఎవరిని తొలగమంటున్నావు, ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు. బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాదు..అనేక దేవీదేవతల స్తుతులూ, ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి, శివానందలహరి, భజగోవిందం , గణేశ పంచరత్న స్తోత్రం,లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకథారా స్తోత్రంవంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. పనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
32వ ఏట కాశీలో తనువు చాలించిన ఆది శంకరాచార్యులు
శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారు..వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేస్తున్నాయి ఈ మఠాలు. 32 వ ఏట పరమేశ్వరుడు కొలువుండే కాశీలో దేహాన్ని త్యజించారు ఆంది శంకరాచార్యులు. ఆధ్యాత్మికపరమైన పవిత్రతను కాపాడుతూ, దేవాలయాల అభివృద్ధికి పాటుపడడం కన్నా ఆది శంకరాచార్యులవారికి మనం ఇచ్చేదేం ఉండదని గుర్తించాలని చెబుతారు పండితులు.