ప్రతి పది మందిలో ఏడుగురికి ఇదే సమస్య, మీకుందేమో చెక్ చేసుకుని జాగ్రత్త పడండి!

ఒక్క క్షణం ఫోన్‌ కనిపించకపోతే కంగారు పడిపోతున్నారా? మొబైల్‌ సిగ్నల్‌ పోతే ఆందోళనకు గురవుతున్నారా? బ్యాటరీ అయిపోతోందంటే మీ ప్రాణం పోయినంతగా ఫీలైపోతున్నారా? అయితే మీకు ఈ ఫోబియా ఉన్నట్టే. మీరు మాత్రమే కాదు ప్రతి నలుగురిలో ముగ్గురు, ప్రతి పదిమందిలో ఏడుగురు ఇదే ఫోబియాతో బాధపడుతున్నారు. దీని పేరే నోమోఫోబియా. దీనిని మొదటిసారిగా 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్‌ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్‌ 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

నోమోఫోబియా అంటే
మొబైల్‌కు ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయాన్నే నోమోఫోబియా అని పిలుస్తారు. నో( NO ) మొబైల్‌ ( MO ) ఫోన్‌ ( PHO) ఫోబియా (BIA) అనే పరిస్థితి నుంచే NOMOPHOBIA అనే పదం వచ్చింది. ఇదొక రకమైన మానసిక సమస్య. నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. అప్పటికీ ఇప్పటికీ నోమోఫోబియాతో బాధపడేవాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రతి నలుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారని రీసెంట్ గా నిర్వహించిన సర్వేల్లో కూడా వెల్లడైంది.

నోమోఫోబియా ఎందుకొస్తుంది!
ఒకప్పుడు మొబైల్‌ను కాల్స్‌ మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి పనిలోనూ స్మార్ట్‌ఫోన్‌ భాగమైపోయింది. దీనికితోడు గేమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలామంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఫోన్‌ దూరమైతే తమ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినట్లుగా కంగారు పడిపోతున్నారు.

నోమోఫొబియా లక్షణాలు
మీకు నోమోఫొబియా లక్షణాలు ఉన్నాయో లేదో సులువుగానే గుర్తించవచ్చు. ఫోన్‌ను కొద్దిసేపు ఆఫ్ చేయడానికి కూడా ఇబ్బంది పడటం, ఒకవేళ పక్కనబెట్టినా లేదా జేబులో పెట్టుకున్నా సరే మిస్‌డ్‌కాల్స్‌, మెసేజెస్‌ ఏమైనా వచ్చాయా అని మాటిమాటికి ఫోన్‌ తీసుకుని చూసుకోవడం, నెట్‌వర్క్‌ లేకపోయినా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయినా కంగారుపడిపోవడం, బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ ఎక్కడ స్విచ్ఛాఫ్‌ అయిపోతుందో అని ఆందోళన చెందడం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలే. వీటికి తోడు ఎప్పుడూ విచారంగా ఉండటం, ఎవరినో కోల్పోయినట్లుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అనిపించడం, అభద్రతాభావం, ఇతర పనుల మీద ఫోకస్‌ చేయలేకపోవడం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలే.

ఎలా నియంత్రించుకోవాలి
గంటలకొద్దీ మొబైల్‌ ఫోన్‌ను వినియోగించకుండా స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. రోజులో ఇంత సమయం మాత్రమే ఫోన్‌ను వాడాలని కచ్చితమైన టైమ్‌ లిమిట్‌ను సెట్‌ చేసుకోండి. కొంతమంది రాత్రి పడుకున్న తర్వాత కూడా ఏదైనా నోటిఫికేషన్‌ వస్తే లేచి మొబైల్‌ చూస్తుంటారు. ఈ అలవాటును మానుకోవాలి. రోజు ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లి ఒక్కరోజు సెలవు ఎలా తీసుకుంటున్నామో మొబైల్‌ ఫోన్‌కు కూడా అలాగే సెలవు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. 24 గంటలు ఫోన్‌కే అతుక్కుపోకుండా ఇతరత్రా కార్యకలాపాలపై కూడా దృష్టిసారించాలి. మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామం చేయాలి. ప్రకృతితో మమేకం కావాలి. దీనివల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…