మధ్యప్రదేశ్ కొత్త సీఎం సంచలన నిర్ణయాలు…

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ .. తమ ముఖ్యమంత్రుల ఎంపికలో సంచలనాలకు అవకాశం ఇచ్చింది.బారులు తీరిన ఆశావహులను పక్కకు నెట్టి… కొత్త వారికి అవకాశం ఇచ్చింది. మధ్యప్రదేశ్లో ఓబీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన మోహన్ యాదవ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి సామాజిక న్యాయానికి అవకాశం ఇచ్చింది. మోహన్ యాదవ్ కూడా అంతే తీరుతో స్పందిస్తూ… కొన్ని చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకున్నారు….

మత ప్రదేశాల్లో అనుమతిలేని లౌడ్ స్పీకర్ల నిషేధం

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ .. మత ప్రదేశాల్లో మైకులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేస్తోంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో లౌడ్ స్పీకర్లు వాడరాదని ఎంపీ కొత్త సీఎం మోహన్ యాదవ్ ఉత్తర్తులు జారీ చేశారు. సీఎంగా ఆయన తొలి ఉత్తర్వు కూడా అదే అవుతుంది. అదే విధంగా మత ప్రదేశాల్లో అనుమతి లేని లౌడ్ స్పీకర్లు, డీజేలు పెట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది. 2000 సంవత్సరం నాటి మితిమీరిన శబ్దకాలుష్య నియంత్రణా చట్టం వీరందరికీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు జరిపేందుకు వీలుగా ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్ ని నియమిస్తారు. డిసెంబరు 15 నుంచి 31 వరకు వేర్వేరు ప్రాంతాల్లో తిరిగే ఈ స్క్వాడ్స్ ఎక్కువ శబ్దం చేస్తున్న లౌడ్ స్పీకర్స్ ను గర్తించి.. మూడు రోజుల్లోగా సరిదిద్దుకోవాలని నోటీసులు జారీ చేస్తుంది. తర్వాత కూడా అదే పద్ధతి కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తుంది.

పెద్దలతో చర్చల ప్రక్రియ

మత పెద్దలతో చర్చలు జరిపి లౌడ్ స్పీకర్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు అందాయి.సీఐడీ ఏడీజీపీ దీనికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. లౌడ్ స్పీకర్లపై నిఘాను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. చట్టాలను అతిక్రమించే వారిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను అదేశించారు.

మాంసం విక్రయంపై ఆంక్షలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాసం, చేపలు, కోడి గుడ్ల విక్రయంపై నిషేధం విధించింది. ఆహార శాఖ అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జనంలో అవగాహన కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే షాపుల్లో విక్రయానికి ఎలాంటి అవరోధాలు ఉండవు.మరో పక్క ఆస్తుల బదలాయింపు సంబంధించిన సైబర్ తెహసీల్ స్కీమ్ పేరుతో సింగిల్ విండో విధానం అమలు చేస్తారు. జనవరి ఒకటి నుంచి 55 జిల్లాల్లో దీనిని అమలు చేస్తారు. ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనవరి 22న యూపీ వెళ్లి వచ్చే యాత్రికులను ప్రత్యేకంగా సన్మానించాలని కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.