మధ్యప్రదేశ్ ఇండియా గ్రూపులో సీట్ల సంకటం

ప్రధాని మోదీపై సమరభేరీ మోగించాలన్న సంకల్పంతో ఏర్పాటైన ఇండియా గ్రూపుకు ఆదిలోనే హంసపాదు పడుతోంది. గ్రూపు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏదోక వివాదం చెలరేగుతుండగా, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి మరీ సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ధిక్కరించేందుకు మిత్రపక్షాలు రెడీ అవుతున్నాయి…

ఆప్, ఎస్పీ అభ్యర్థులు రెడీ

ఈ ఏడాది ఆఖరుకు ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్లో ప్రధాన పోటీ అధికార బీజేపీకి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా గ్రూపుకు మధ్య ఉంటుందని భావించారు. ఇప్పుడు ఇేండియా గ్రూపులోనే చీలిక లాంటి పరిస్థితి ఉత్పన్నమై, ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సమీకరణాల సంగతి తర్వాత చూసుకుందాం…ముందు మధ్యప్రదేశ్లో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందాం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) రంగంలోకి దిగాయి. ఎన్నికల షెడ్యుల్ రాకముందు షోడౌన్ కు సిద్ధమైనట్లుగా ఎస్పీ ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అందులో రాజ్ నగర్, భాందేరీ, సింగ్ రౌలీ కూడా ఉన్నాయి. త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామని ఆప్ ప్రకటించింది. రాజకీయాలతో సంబంధం లేని తటస్థులకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆప్ నిర్ణయించుకుంది.

కేజ్రీవాల్ ర్యాలీలతో కాంగ్రెస్ కు శిరోభారం

కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఊపు రాకముందే ఆప్, ఎస్పీ జోష్ గా కనిపిస్తున్నాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ర్యాలీల మీద ర్యాలీలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన గ్వాలియర్, సాత్నా, రేవాలో జరిపిన ర్యాలీలు విజయవంతమయ్యాయని ఆప్ చెప్పుకుంటోంది. మరో నాలుగు ర్యాలీలు ప్లాన్ చేసినట్లు ఇకపై ప్రతీ వారం కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ పర్యటనకు వస్తారని ఆప్ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఈ నెల 27న రేవా జిల్లా సేమారియా నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మరుసటి రోజే ఆయన ఖజురహోలో పర్యటిస్తారు. పైగా తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సమాజ్ వాదీ పార్టీ మధ్యప్రదేశ్ శాఖ అంటోంది.

లైట్ తీసుకున్న బీజేపీ..

ఇండియా గ్రూపులోని తాజా పరిణామాలను బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ 27 సార్లు మధ్యప్రదేశ్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోదీ ఒక్కరే 30 బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా మధ్యప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాంగ్రెస్, ఆప్, ఎస్పీ కలిసిపోటీ చేసినా విడిగా పోటీ చేసినా తమకు పెద్దగా ఒరిగే నష్టమేదీ లేదని బీజేపీ వర్గాల వాదన. వాళ్లంతా కలిసికట్టుగా వచ్చినా గెలుపు తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. కాకపోతే ఆప్, ఎస్పీ వైఖరితో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేతలకు మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి….