ఎన్నికల్లో అక్రమాలు ప్రజాస్వామ్యానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నికలను సిబ్బంది పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. అయితే పౌరులు కూడా తప్పుడు జరగకుండా చూసేలా భాగస్వామ్యం చేసేలా ఈసీ కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందు కోసం ఓయాప్ రెడీ చేసింది. దానిపేరు సీ విజిల్.
సీ విజిల్ యాప్ ద్వారా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేసే చాన్స్
ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు మద్యం, డబ్బు పంపిణీపై నిఘా పెట్టేందుకు ఎలక్షన్ కమిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఈ యాప్‌ను ఉపయోగించింది. అప్పట్లో ఈ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీ-విజిల్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఫోటోలు, ఆడియో, వీడియోల ఆధారంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఫిర్యాదు చేసే వారి పేర్లు రహస్యం
ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. మీ పేరు, జిల్లా, పిన్‌కోడ్ వంటి వివరాలు ఎంటర్ చేయమంటుంది. అనంతరం ఫొటో, ఆడియో, వీడియో మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రొసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది. సీ-విజిల్ ద్వారా చేసే ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతారు.
నిమిషాల్లోనే స్పందించనున్న ఎన్నికల సంఘం
ఎక్కడైతే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు, ఇతర సామాగ్రి పంపిణీ చేస్తూ.. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తారో దానికి సంబంధించిన ఫొటో, ఆడియో, వీడియో గానీ తీసి.. దాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇందులో అప్‌లోడ్ చేసిన ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు ఉపక్రమిస్తుంది. సీ-విజిల్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లను ఈసీ రహస్యంగా ఉంచు తుంది. అంతేగాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు.