సనాతన ధర్మం – తమిళనాట ఇక బీజేపీ దూకుడే…

తమిళనాడు యువజన, క్రీడల శాఖామంత్రి ఉదయనిధి స్టాలిన్ తనకు తెలియకుండా సుదీర్ఘకాలం సాగబోయే వివాదానికి తెరతీశారు. రాజకీయ ప్రత్యర్థులకు ఫ్రీగా ఆయుధాలు అందించారు. బీజేపీతో పాటు పలు పార్టీలు పూర్తి అఫెన్స్ ఆడేందుకు అవకాశం కల్పించారు.

ఇక దేవాదాయ శాఖ ఎందుకు.. ?

ప్రభుత్వమూ, ప్రభుత్వంలోని వ్యక్తులు సనాతన ధర్మమే వద్దని వాదిస్తున్నప్పుడు ఇక తమిళనాడుకు దేవాదాయ, ధర్మాదాయ మంత్రిత్వ శాఖ ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోంది. విచిత్రమేమిటంటే ఉదయనిధి మాట్లాడిన సభలోనే తమిళనాడు దేవాదాయ మంత్రి పీకే శేఖర్ బాబు కూడా పాల్గొన్నారు. స్టాలిన్ తనయుడు మాట్లాడున్నంత సేపు ఆయన ప్రేక్షక పాత్ర వహించారు. అదేంటి హిందూధర్మాన్ని కాపాడాల్సిన మంత్రి మౌనంగా ఉండటమేంటన్న ప్రశ్న తలెత్తింది. కాకపోతే పార్టీవాళ్లు కదా అని కొందరు సరిపెట్టుకుంటున్నా.. బీజేపీకి మాత్రం మంచి అమ్యూనీషన్ దొరికినట్లయ్యింది. దేవాదాయ మంత్రి శేఖర్ బాబు తక్షణమే రాజీనామా చేయాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడైన మాజీ ఐపీఎస్ అన్నామలై డిమాండ్ చేస్తున్నారు. పదో తేదీ లోపు మంత్రి రాజీనామా చేయకపోతే ఆయన్ను ఘెరావ్ చేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది. దేవాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం సహా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల ముందు ధర్నాలు, దిగ్బంధనాలు ఉంటాయి.

బీజేపీ రాష్ట్ర పర్యటన…

బీజేపీ నేతలు తమిళనాడు అంతటా పర్యటించి స్టాలిన్ ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగీతో ఎలా పోల్చుతారన్నది ఇప్పుడు నేతలు వేస్తున్న మౌలికమైన ప్రశ్న. సనాతన ధర్మంలోనూ సామాజిక న్యాయం ఉందని ఆ సంగతి డీఎంకే వారికి ఎన్నటికీ అర్థం కాదని బీజేపీ వాదిస్తోంది.

ఉదయనిధికి అర్థంకాని విషయాలు…

యువకుడు, మొదటి నుంచి ద్రవిడ ఉద్యమమే గొప్ప అనుకుని రాజకీయాల్లో సెటిలైన ఉదయనిధికి హిందూ ధర్మం గురించి ఏ మాత్రం తెలియదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సనాధర్మం వల్ల సతీ సహగమనం, బాల్య వివాహాలు, బాల వితంతువులు తయారయ్యాయని ఆయన విశ్లేషించారు. వాస్తవానికి మధ్యయుగంలో ముస్లిం దండయాత్రల వల్ల వచ్చినవని ఆయనకు ఎవరైనా చెబితే బావుంటుంది. తమిళనాడు బీజేపీ శాఖ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోంది.

జర్నలిస్టు దుగ్గరాజు అభ్యంతరం

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సహేతుకం కాదని, అత్యంత గర్హనీయమని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు అన్నారు. లౌకిక పార్టీలుగా చెప్పుకునే కొన్ని రాజకీయ శక్తులు దీనిపై మౌనం వహించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. అదే హిందువులు ఇతర మతాలపై కామెంట్స్ చేస్తే.. ఈ పాటికి గందరగోళ పరిస్థితి ఏర్పడేదన్నారు. భారత లౌకిక వ్యవస్థలో హిందువుల మత విశ్వాసాలు, జీవన విధానం గురించి ఎలాగైనా మాట్లాడొచ్చని, అది రాజ్యాంగమిచ్చిన భావప్రకటనా స్వేచ్ఛ అని డాక్టర్ దుగ్గరాజు గుర్తుచేశారు.