శాకుంతలం ప్లాప్. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్లు లేవు. గుణశేఖర్, సమంత ఫుల్ డిప్రెషన్ లో ఉన్నారు. కానీ వీళ్లకంటే ఎక్కువ డిప్రెషన్ లో ఉంది మాత్రం ఆదిపురుష్ టీమ్. అసలు శాకుంతలం సినిమాకు, ఆదిపురుష్ కు సంబంధం ఏంటి అంటే చాలానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు సినిమాలు మైథలాజికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవే. శాకుంతలం స్టోరీ అందరికి తెలిసిందే. అందరికి తెలిసిన కథని సినిమాగా చెప్తున్నప్పుడు ఎంత అద్భుతంగా తీయాలి. ప్రేక్షకుల్ని స్క్రీన్ ప్లే తో ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి. అలాంటిది తర్వాతి సీన్ ఏమోస్తుందో ప్రేక్షకుడు చెప్పేస్తుంటే... ఆ సినిమా ఫ్లాప్ అవ్వక ఏమౌతుంది. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ లోనే ఆదిపురుష్ కూడా ఉంది. రామాయణం గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. వాటన్నింటిని కాదని మన ఊహకు అందకుండా ఆదిపురుష్ ఉంటే హిట్ అవుతుంది. మరి మన ఊహకు అందకుండా తీసేందుకు దమ్ము ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ కు ఉందా అంటే... కష్టమే. ట్రైలర్ తోనే అతను చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొంపముంచుతున్న గ్రాఫిక్స్..
బాహుబలి లాంటి సినిమాలు బాగా ఆడాయి అంటే అందులో కథ ఉంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది. అన్నింటికి మించి భారతీయ ప్రేక్షకులకు కావాల్సిన డ్రామా ఉంది. పాత్రల మధ్య సంఘర్షణ ఉంది. వీటికి హీరోలు, హీరోయిన్లు, రాజమౌళి, హై విజువల్ గ్రాఫిక్స్ తోడవ్వడంతో… సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ కొంతమంది దర్శకులు మాత్రం అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. శాకుంతలం సినిమా కూడా అలాంటి బాపతే. రిజల్ట్ కూడా అందరికి తెలిసిందే. అదీగాక శాకుంతలం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా లో క్వాలిటీ గ్రాఫిక్స్ సినిమాలు వస్తే… అవన్నీ రాబోయే పాన్ ఇండియా మూవీస్ పై ప్రభావం చూపిస్తాయి. మార్కెట్ తగ్గుతుంది, ఆడియన్స్ కి క్రేజ్ కూడా ఉండదు. ఇదే ఇప్పుడు ఆదిపురుష్ టీమ్ ని కంగారు పెడుతుంది. ఆదిపురుష్ టీజర్ కు ఇలాంటి రెస్పాన్సే వచ్చింది. గ్రాఫిక్స్ చాలా చండాలంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోల్ జరిగింది. అప్పటినుంచి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ ఈలోగా శాకుంతలం వచ్చి ఆదిపురుష్ టీమ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు ఆదిపురుష్ కు సంబంధించిన ఏ చిన్న టీజర్ వచ్చినా దాన్ని శాకుంతలంతో కంపేర్ చేయడం మొదలుపెడతారు. దీంతో… ఆదిపురుష్ టీమ్ డిఫెన్స్ లో పడిపోయింది. ఏం చెయ్యాలా అని తలపట్టుకు కూర్చుంది.
ఏజెంట్ ఆడకపోతే… అయ్యగారు రీ లాంచ్ తప్పదా?
నాగార్జున నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. వచ్చిన దగ్గరనుంచి మంచి దర్శకులు, మంచి కథలతోనే సినిమా చేస్తున్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీ ఆశించే, అభిమానులకు కిక్ ఇచ్చే హిట్ ఇంతవరకు పొందలేకపోయాడు. మొదటి రెండు సినిమాలు ఏదో అనుకున్నా కానీ ఆ తర్వాత అల్లు అరవింద్ లాంటి దిగ్గజం రంగంలోకి దిగినా కూడా అఖిల్ కు హిట్ రాలేదు. దీంతో.. అటు అఖిల్, ఇటు అక్కినేని ఫ్యామిలీ అందరూ లేటెస్ట్ ఫిల్మ్ ఏజెంట్ పనే నమ్మకం పెట్టుకున్నారు. మరి అఖిల్ ఆశల్ని ఏజెంట్ తీరుస్తుందా అంటే ఏమో అనాల్సిన పరిస్థితి.
పాన్ ఇండియా ఏజెంట్
లెక్కప్రకారం ఏజెంట్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. బడ్జెట్ పెరిగిపోవడం, షూట్ లేటవ్వడం, దీనికితోడు కోవిడ్ రావడంతో లేట్ అయ్యింది. సినిమా లేట్ అయినా ప్రమోషన్స్ విషయంలో మాత్రం లేట్ చెయ్యడం లేదు మేకర్స్. ఫుల్ రేంజ్ లో చేస్తున్నారు. మొన్నటికి మొన్న విజయవాడలో అఖిల్ తో పెద్ద జంప్ చేయించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఎంత చేసినా ఏజెంట్ సినిమాపై బజ్ మాత్రం రావడం లేదు. దానికి కారణం… ఆడియన్స్ కు సినిమా ట్రైలర్ కానీ, పాటలు కానీ కనెక్ట్ కాకపోవడమే. ఇందులో అఖిల్ లుక్.. ఏదో విలన్ లా ఉంది కానీ ఎక్కడా హీరోలా లేదు. దీంతో.. ఇదేదో మన సినిమా కాదు అనే ఫీలింగ్ లో ఉన్నారు ఆడియన్స్. అయితే అఖిల్ మాత్రం సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇంత కష్టపడినందుకు అయినా అఖిల్ కు హిట్ రావాల్సిందేనని అభిమానులు ఆశ పడుతున్నారు.
తేడా కొడితే… లెక్కలు మారిపోతాయ్
ఏజెంట్ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. హిట్ గ్యారంటీ అంటున్నారు. అఖిల్ పై 100 కోట్లు ఖర్చుపెట్టారు కానీ అతనికి అంత మార్కెట్ లేదు. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఏజెంట్ సినిమాకు బాహుబలి రేంజ్ లో హైప్ వస్తే తప్ప పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని రాబట్టడం కష్టమే. ఒకవేళ సినిమా కానీ తేడా కొడితే… అఖిల్ మళ్లీ మొదటి నుంచి కెరీర్ మొదలుపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అటు అఖిల్ కానీ, ఇటు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కానీ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాతో అఖిల్ రేంజ్ మారిపోతుందని అంటున్నారు. మరి అభిమానుల ఆశలు ఏజెంట్ సినిమాతో అఖిల్ తీరుస్తాడో లేదో వెయిట్ అంట్ సీ.
10.చిన్న హీరోలకు పెద్ద దిక్కుగా పెద్ద హీరోలు
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో అంటే ఇంకో హీరోకి పడదు. పైకి బాగానే మాట్లాడుతున్నా… వారి మధ్య ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది. ఒకర్ని మించి ఇంకొకరు హిట్ ఇవ్వాలని ట్రై చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో మిగితా విషయాలు ఏవీ పట్టించుకోరు. చిన్న హీరోల్ని అయితే దేకను కూడా దేకరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలు బాహాటంగానే ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తున్నారు. కలిసి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక చిన్న సినిమాల్ని, చిన్న హీరోల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదపడుతున్నారు.
మేమున్నాం… వస్తున్నాం..
ఒక సినిమా గురించి ఎంత ప్రమోట్ చేసినా… ఒక పెద్ద హీరో, పెద్ద స్టార్ చెప్పే నాలుగు మాటలకు చాలా వేల్యూ ఉంటుంది. ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా తమ హీరో కోసం చిన్న హీరోల్ని ఎంకరేజ్ చేస్తారు, వారి సినిమాలు చూస్తారు. మొన్నటికి మొన్న దసరా సినిమా బావుంది అంటూ మహేశ్, ప్రభాస్ ట్వీట్లు చేశారు. నిన్నటికి నిన్న ఈ సమ్మర్ దసరాదే అంటూ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. అల్టిమేట్ గా ఇదంతా సినిమా హిట్ కోసమే. మరిన్ని కలెక్షన్లు రాబట్టడం కోసమే. ఇంకొంతమంది హీరోలు అయితే… చిన్న హీరోల కోసం ఆడియో ఫంక్షన్లు కూడా వచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. దాస్ కా దమ్కీ సినిమా కోసం ఎన్టీఆర్ కదిలివచ్చాడు. సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ సినిమా ఆడియో ఫంక్షన్లకు బాలయ్య వచ్చి ప్రమోట్ చేశాడు. ఇక మెగాస్టార్ గురించి చెప్పాల్సిన పనే లేదు. చిన్న హీరో ఎవ్వరైనా సరే మెగాస్టార్ స్వయంగా ఆడియో ఫంక్షన్ కి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేస్తారు.
ఓటీటీలే కారణమా..
గతంలో చిన్న హీరోల్ని ప్రమోట్ చేసే పద్ధతి చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కువైంది. దానికి కారణం ఓటీటీ. ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ అంతా చిన్న స్క్రీన్ లోనే దొరుకుతుంది. దీంతో.. థియేటరకు వచ్చే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే పెద్ద హీరోల సినిమాలకు ఆ ప్రాబ్లమ్ లేదు. స్టార్ సినిమా అయితే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూస్తున్నారు. ఓపెనింగ్స్ వస్తున్నాయి. సినిమా బావుంటే హిట్ అవుతుంది. కానీ చిన్న హీరోల సినిమాకు ఓపెనింగ్స్ ఉండవు. సినిమా బావుందని టాక్ వస్తే ఆడియన్స్ వస్తున్నారు. అలా కాకుండా చిన్న హీరోల సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావాలంటే దానికి సరైన మార్గం స్టార్స్ తో ప్రమోట్ చేయించడమే. అందుకే చిన్న హీరోలు కూడా తమ సినిమా ఫంక్షన్లకు స్టార్స్ ని ఇన్వైట్ చేస్తున్నారు. ప్రమోషన్లు చేసుకుంటున్నారు.