యువత బలిదానాలు : నాడు బీఆర్ఎస్‌కు బలం – నేడు పతనానికి కారణం !

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తాను మెడను నరుక్కుంటాను కానీ మీరెవరూ ప్రాణత్యాగం చేయవద్దని పదే పదే కోరేవారు. ఉద్దేశపూర్వకంగా ఆయన అలా చెప్పడం… రెచ్చగొట్డడమేనని అందరికీ తెలుసు. ఈ పిలుపుల కారణంగా వందల మంది యువత ఆత్మహత్య చేసుకునేవారు. కేసీఆర్ అలంటి ప్రకటనలు ఇచ్చిన వెంటనే అలా కోరిన వెంటనే కొన్ని ఆత్మహత్యలు నమోదయ్యేవి. వాటితో ఉద్యమం మరింత ఎగసిపడేది. ఆ ఆత్మహత్యల కేంద్రంగా ఎంత రాజకీయం జరిగిందో చెప్పాల్సిన పని లేదు.

ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్య లు

మూడో సారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్‌కు ఇలాంటి ఆత్మహత్యలే గండంగా మారాయి. గ్రూప్స్ పరీక్షల్ని సరీక్షా నిర్వహించలేకపోవడంతో పదే పదే వాయిదాలు పడ్డాయి. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. ఇక గ్రూప్స్ పరీక్షలు జరగవేమో అన్న ఆందోళనతో ప్రవళ్ళిక అనే వరంగల్ యువతి హైదరాబాద్ అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకుంది. అశోక్ నగర్ అంటేనే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఉన్న కాలనీగా గుర్తింపు ఉంది. ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చారు. సోషల్ మీడియా అంతా మార్మోగిపోయింది. ప్రభుత్వంపై యువత అంతా విరుచుకుపడుతున్నారు.

ప్రవళ్లిక గ్రూప్స్‌కు అప్లయ్ చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యలతో యువత ఆగ్రహం

ప్రవళ్లిక మరణంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమెది ఉద్యోగం కోసం చేసుకున్న ఆత్మహత్య కాదని. ప్రేమ కారణంతో చేసుకుందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించింది. తర్వాత పోలీసులు అదే కథ చెప్పారు. టీవీ చానల్ లో కూర్చుని కేటీఆర్ కూడా అసలు ఆమెకు గ్రూప్స్ అప్లయ్ చేయలేదట అని వ్యాఖ్యానించారు. కానీ ప్రవళ్లిక గ్రూప్ వన్ మాత్రమే కాదు..గ్రూప్ ఫోర్ కి కూడా అప్లయ్ చేశారు. కేటీఆర్ మాటలతో నిరుద్యోగుల్లో మరింత ఆగ్రహం కనిపిస్తోంది.

ఏకమైన యువత !

ప్రభుత్వ చేతకాని తనం వల్ల బలైపోయిన యువతి పట్ల కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని.. ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇది నిరుద్యోగులంతా ఏకమయ్యేలా పరిస్థితి క్రియేట్ చేసింది. ఒక్క ఆత్మహత్య వ్యవహారంతో గతంలో .. జరిగిన పేపర్ లీకేజీలన్నీ బయటకు వచ్చాయి. ఎంసెట్ లీకేజీల దగ్గర్నుంచి జరిగిన వ్యవహారాలు… ఇంటర్ పిల్లల ఆత్మహత్యలు అన్నీ తెరపైకి వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జరిగుతున్న ఈ వ్యవహారాలు భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా.. తిరిగి తిరిగి బీఆర్ఎస్ దగ్గరకే వస్తూండటంతో ఆ పార్టీ నేతల్లో కలవరం ప్రారంభమయింది. అప్పుడు దేనితో రాజకీయం చేశారో ఇప్పుడు దానితోనే పతనమవబోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.