ఇంట్లో అయినా ఆలయంలో అయినా దైవారాధనలో పాటించాల్సిన నియమాలు

ఇంట్లో నిత్యం దీపారాధన చేసి పూజలు చేసేవారు కొందరు, పండుగలు ప్రత్యేక దినాల్లో పూజలు నిర్వహించేవారు ఇంకొందరు, ఆలయాలకు వెళ్లినప్పుడు మాత్రమే దేవుడిని స్మరించుకునేవారు ఇంకొందరు. అయితే ఎక్కడైనా కానీ దేవుడి పూజలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ఆ నియమాలేంటో చూద్దాం

దేవుడి పూజ కు ఉపయోగించిన పీట లేదా ఆసనాన్ని మరొకదానికి ఉపయోగించకూడదు, పూజ పూర్తైన వెంటనే ఆ ఆసనం తీసేయాలి అక్కడే ఉంచేయకూడదు.

దీపారాధన శివుడికి ఎడమవైపు, శ్రీ మహావిష్ణువికి కుడివైపు చేయాలి కానీ దేవుడికి ఎదురుగా చేయకూడదు

ఉదయం సమయంలో దీపారాధ ఎంత పుణ్యఫలమో సాయంత్రం సమయంలో దీపారాదన అంతకు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. అందుకే రెండు సమయాల్లోనూ దీపారాధన చేయాలి. ఉదయం కుదరని వాళ్లు సాయంత్రం అయినా దీపారాధన చేయాలి

గోమాతకు పూజ చేస్తున్నప్పుడు ముందు ముఖానికి బొట్టుపెడుతుంటారు చాలామంది. కానీ గోమాతకు ముందు వెనుక వైపు పూజచేసిన తర్వాతే ముఖానికి పూజచేయాలి

శివాలయాన్ని సందర్శించేవారు ముందుగా నందీశ్వరుడిని ప్రార్థించిన తర్వాతే లోపలకు వెళ్లాలి

వివాహితులు తమ సౌభాగ్యం కోసం తులసిమాతను పూజిస్తారు. కనీసం స్నానం అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించినా చాలు

పరమేశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేసేవారు శివానుగ్రహం పొందుతారు, శ్రీ మహావిష్ణువును తులసీదళాలతో పూజించాలి

గుడిలో అయినా ఇంట్లో అయినా తీర్థం తీసుకునేటప్పుడు కుడిచేత్తో మాత్రమే తీసుకోవాలి. అయితే గుడిలో తీర్థం తీసుకున్నప్పుడు నిలబడి ఉండాలి, ఇంట్లో తీర్థం తీసుకున్నప్పుడు కూర్చుని ఉండాలి

నిత్యం తినే ప్లేట్లలో దేవుడికి సంబంధించిన పూలు పెట్టరాదు, అక్షింతలు కలపరాదు

ఏ రోజు కోసిన పూలతో ఆ రోజే పూజ చేయాలి, నిల్వ ఉంచిన పూలతో పూజ తగదు. పరుల ఇంట్లో చెట్లకున్న పూలు కోసి పూజలు చేసినా ఆ ఫలితం ఆ ఇంటివారికే దక్కుతుంది.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం