ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రంగాలు పరుగులు తీస్తున్నాయి. దేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోంది. పేద, మధ్య తరగతి వర్గాల కోసం మోదీ చేపట్టిన ఆర్థిక సంస్కరణకు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి పన్ను వసూళ్లలోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. ఆ నిధులతో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పనులు చేపట్టేందుకు దోహదం చేస్తోంది…
నిర్మలా సీతారామన్ సుదీర్ఘ పోస్ట్…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాజిక మాధ్యమాల్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. లోక్ సభకు మూడో దశ పోలింగ్ జరుగుతున్న వేళ ఆమె పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. అందులో ఆమె ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ ను నియమించామని ఆమె గుర్తుచేశారు. అలాగే జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లకు చేరాయని ఆమె చెప్పారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలే ఇందుకు కారణమని ఆమె విశ్లేషించారు. పేదల సంక్షేమానికి చేపట్టే ఆర్థిక కార్యకలాపాల ద్వారా జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని ఆమె నిగ్గుతేల్చారు.
రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం…
రాహుల్ గాంధీ లాంటి నేతలు జీఎస్టీని బబ్బర్ టాక్స్ అని పిలుస్తున్నారు. తాము అధికారానికి వస్తే దాన్ని రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిర్మలమ్మ విడుదల చేసిన తాజా లెక్కలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. జీఎస్టీ బట్వాడాలో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక చేస్తున్న ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. దేశంలో సహకార సమాఖ్య విధానం ద్వారా రాష్ట్రాలకు సాధికారత సాధ్యపడిందని ఆమె అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ లో కేంద్రానికి మూడో వంతు, రాష్ట్రాలకు మూడింట రెండో వంతు ఓట్ షేర్ ఉంటుందని ఆమె ప్రస్తావించారు. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు…
ఎస్జీఎస్టీలో 100 శాతం రాష్ట్రాలకే…
జీఎస్టీతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగయ్యాయని కేంద్రం ఉద్ఘాటించింది. స్టేట్ జీఎస్టీ(ఎస్టీఎస్టీ)లో వంద శాతం రాష్ట్రాలకే ఇస్తున్నామని ప్రకటించింది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర జీఎస్టీలో 42 శాతం రాష్ట్రాలకే వెళ్తోందని గుర్తుచేసింది. జీఎస్టీ లేకపోతే 2023-24లో రాష్ట్రాల రెవెన్యూ రూ.37.5 లక్షల కోట్లు ఉండేదని, ఇప్పుడది రూ. 46.56 లక్షల కోట్లకు చేరిందని నిర్మలా సీతారామన్ లెక్క చెప్పారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ ను నిజం చేసిన వ్యవస్థ జీఎస్టీ మాత్రమేనని కూడా ఆమె అంటున్నారు. పన్నుల వసూలులో రాష్ట్రాలు తలో రూల్ పెట్టకుండా ఏకీకృత విధానం తెచ్చేందుకు జీఎస్టీ దోహదం చేసిందని నిర్మలమ్మ వాదించారు.